ప్రెజర్ కుక్కర్ వెనుక.. 'కారంపూరి బ్రదర్స్'

By అంజి  Published on  13 Feb 2020 8:11 AM GMT
ప్రెజర్ కుక్కర్ వెనుక.. కారంపూరి బ్రదర్స్

మాట్రిక్స్ సినిమాకు వాచౌస్కీ బ్రదర్స్ దర్శకత్వం వహించారు. అది అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మనం కూడా ఓ సినిమాను రూపొందిద్దాం.. అప్పుడు ఆ సినిమాకు డైరెక్టెడ్ బై 'కారంపూరి బ్రదర్స్' అంటూ టైటిల్ కార్డు వేద్దాం అని అనుకున్నామని సుజయ్ కారంపూరి నవ్వుతూ చెప్పుకొచ్చారు. తమకు సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచన వచ్చింది కూడా అక్కడి నుండే అని వారు చెబుతున్నారు.

సుజయ్, సుశీల్ లు ఇద్దరూ కలిసి తెరకెక్కించిన సినిమా 'ప్రెజర్ కుక్కర్'. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అందరినీ అలరిస్తోంది కూడానూ..! యూత్ ఇదే చేయాలి.. ఇలాగే ఉండాలి.. ఏదైనా చేసి ఉన్నత స్థానంలోనే ఉండాలి అంటూ తల్లిదండ్రులు తీసుకొని వచ్చే ఒత్తిడిని ఈ సినిమాలో చూపించారు. ఇప్పటి యూత్ కు అమెరికాకు వెళ్ళాలి.. అక్కడ మంచి జాబ్ తెచ్చుకోవాలి అంటూ తల్లిదండ్రులు ఎలా పిల్లల మీద తమ అభిప్రాయాలను రుద్దుతారో ఇందులో చూపించారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇది.. తమ పిల్లలు పెద్ద ఉద్యోగం సాధించి.. లక్షల్లో జీతం సంపాదిస్తే చాలని అనుకునే చాలా మంది తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా.

ఈ సినిమాలో యువత ఎదుర్కొంటున్న సమస్యలను చూపించామని.. అలాగే కామెడీతో పాటూ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చామని సుజయ్, సుశీల్ చెప్పుకొచ్చారు. సినిమాను ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించామని.. డైలాగ్స్ కూడా అందరికీ నచ్చేలా ఉంటాయని చెబుతున్నారు సుజయ్. ఈ సినిమాకు సంబంధించి 10కి పైగా ప్రివ్యూలు వేశామని అందరూ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారని.. పెళ్లిచూపులు సినిమాకు నెక్స్ట్ లెవెల్ గా ఉందన్నారని ఆనందాన్ని వెలిబుచ్చారు సుజయ్.

సినిమా కథలో చాలా సన్నివేశాలు తన జీవితంలోనూ, తన సోదరుడి జీవితంలోనూ.. తనకు తెలిసిన వారి జీవితంలోనూ చోటుచేసుకున్న ఘటనలేనని.. వాటికి కాస్త సినిమాటిక్ లిబర్టీని జత చేసి రూపొందించినదేనని సుజయ్ చెప్పారు. సినిమాలో సంగీతం కూడా చాలా బాగుందని.. ఈ సినిమా పూర్తీ అవ్వడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టిందని.. కథ-స్క్రీన్ ప్లే రూపొందించడానికి రెండేళ్లు పట్టగా.. షూటింగ్-పోస్ట్ ప్రొడక్షన్ పూర్తీ అవ్వడానికి మరో రెండేళ్లు పట్టిందని చెబుతున్నారు ఈ అన్నదమ్ములు. తమ రెగ్యులర్ ఉద్యోగాలు చేసుకుంటూనే ఈ సినిమాను తెరకెక్కించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు రూపొందించాలని వీరు భావిస్తున్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదల కానుంది.

Next Story
Share it