గర్భిణులు ప్రయాణాలు చేయవచ్చా..?
By సుభాష్ Published on 16 March 2020 9:24 PM IST![గర్భిణులు ప్రయాణాలు చేయవచ్చా..? గర్భిణులు ప్రయాణాలు చేయవచ్చా..?](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/Pregnant-women-travels.jpg)
ఇంట్లో ఉన్న స్త్రీ గర్భం దాల్చిందంటే ఇంటిల్లిపాదికి ఉన్న ఆనందమే వేరు. స్త్రీ గర్భం దాల్చిందంటే చాలు డెలివరీ అయ్యే వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 9 నెలల వరకు అన్నిజాగ్రత్తలు తీసుకుంటారు. గర్భవతిగా ఉన్నసమయంలో చాలా అనుమానాలు, అపోహాలు తలెత్తుతుంటాయి. గర్భిణీగా ఉన్నసమయంలో అది చేస్తే మంచిది.. ఇది చేస్తే మంచిదని ఎన్నో చెబుతుంటారు. ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తుంటారు. కానీ స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ప్రయాణాలు దాదాపుగా తగ్గించాలని స్త్రీ వైద్య నిపుణలు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత ప్రసూతి అయ్యే వరకు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు.
దాదాపు ఐదు నెలల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని చెబుతున్నారు. ఆ తర్వాత ప్రయాణాలు ఖచ్చితమైతే తప్ప ఎక్కడికి వెళ్లకూడదంటున్నారు. 8 నెలల నుంచి బిడ్డ పుట్టే వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, వాతావరణం వల్ల చాలా మందికి ప్రెగ్నెన్సీ మిసయ్యే అవకాశాలున్నాయని, అందుకే ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా జాగ్రత్తలు వహించాలంటున్నారు. ఒకప్పుడు మంచి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల గర్భవతులు వ్యవసాయం పనులు, ఇతర ఏవైనా పనులు చేసినా ఏ సమస్య వచ్చేది కాదని, ఇప్పుడున్న ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.
ఎక్కడైన ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సి వస్తే మెడికల్ రిపోర్టులు సైతం వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ తలనొప్పి, కడుపులో వికారం, నడుము నొప్పి, ఇతర సమస్యలేవైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు