ప్రతిరోజు పండగే లేటెస్ట్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

By Newsmeter.Network  Published on  28 Dec 2019 6:49 AM GMT
ప్రతిరోజు పండగే లేటెస్ట్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

మెగా హీరో సాయి తేజ్ - యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం ప్రతిరోజూ పండగే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్ నిర్మించారు. ఈ సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన పంపిణీదారులు పండగ చేసుకుంటున్నారు. డీసెంట్ మౌత్ టాక్ తో ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకుంది. 6వ‌ రోజు కూడా మొదటి రోజుకు వచ్చినట్లుగా కలెక్షన్స్ రావడంతో చాలా చోట్ల ప్రతిరోజూ పండగే చిత్రం బయ్యర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ఇక క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే... తెలుగులో ఈ చిత్రం 16 కోట్లకు అమ్ముడుపోగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం 15.36 కోట్లు రాబట్టడం విశేషం. క్రిస్మ‌స్ రోజు మ‌ర్నాడు దాదాపు 2.80 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా 5.5 కోట్లకు బిజినెస్ చేయగా, ఇప్పటికే 6.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఏడో రోజు ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రానుంది. మరోవైపు యూఎస్ లో కూడా ప్రతిరోజూ పండగే హవా కొనసాగుతోంది. ఆరో రోజుతోనే $400K మార్క్ ను క్రాస్ చేసింది. ఫుల్ ఫన్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతిరోజు పండగే 40 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సాయి తేజ్ కెరీర్ లో ఇంత భారీ ఎత్తున కలెక్షన్స్ రావడం విశేషం. మ‌రి.. ఫుల్ ర‌న్ ఇంకెంత వ‌సూలు చేస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఈ సినిమాతో సాయి తేజ్ ఫామ్ లోకి రావ‌డంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడ‌ట‌. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా త‌న‌కి పండ‌గ తీసుకువ‌చ్చింద‌ని స‌న్నిహితులు క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడ‌ట‌.

Next Story