‘ప్రతిరోజు పండగే’లో మంచి ఫీల్ ఉంది: మారుతి

By అంజి
Published on : 21 Nov 2019 4:34 PM IST

‘ప్రతిరోజు పండగే’లో మంచి ఫీల్ ఉంది: మారుతి

సుప్రీం హీరో సాయి తేజ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా హ్యాట్రిక్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో జిఏ2, యూవీ పిక్చర్స్ బేనర్‌లో ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ సమర్పణలో బ‌న్నీవాస్ నిర్మిస్తున్న చిత్రం “ప్రతిరోజు పండగే”. సత్య రాజ్, రావు రమేష్, విజయ్ కుమార్, మురళి శర్మ, అజయ్, గాయత్రీ భార్గవి, హరితేజ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టీజర్, టైటిల్ ట్రాక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా ప్రస్తుతం ఈ చిత్రం నుంచి రెండవ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. లాస్ట్ ఇయర్ తర్వాత ఏదయినా మంచి సినిమా తీయాలి అని రకరకాల కథలు అనుకోవడం జరిగింది. అనుకోకుండా కుటుంబకథా చిత్రం తీసుకోవడం జరిగింది. ఫ్యామిలీ సినిమా అనగానే సోషల్ మీడియాలో గతంలో వచ్చిన కుటుంబకథా చిత్రాలతో పోల్చడం పరిపాటి అయిపోయింది. అయితే ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకూ రాని పాయింట్ తో ‘ప్రతిరోజు పండగే’ తెరకెక్కింది. ఎందుకంటే చాలా మంచి విషయాన్ని ఎంటర్టైన్ చేస్తూ చెప్పడం జరిగింది. పుట్టినప్పుడు ఎలాగైతే సెలబ్రేషన్ చేస్తామో అలాగే ఒక వ్యక్తి చనిపోతున్నాడు అని తెలిసినప్పుడు కూడా సంతోషంగా తనకి బెస్ట్ సెండాఫ్ ఇవ్వడం అనేది కూడా మన భాద్యతే అనే పాయింట్ ని అంతర్గతంగా చెప్పడం జరిగింది.

ప్రస్తుత సమాజంలో తన తండ్రికి పంచాల్సిన ప్రేమను కూడా తమ పిల్లలకు పంచుతున్నారు. తండ్రిని మర్చిపోతున్నారు. అలాంటి సందర్భంలో తండ్రికి ఎంత వాల్యూ ఇవ్వాలని అనేది మంచి ఎంటర్టైన్ చేస్తూ ఖ‌చ్చితంగా అందరికీ నచ్చే విధంగా హార్ట్ టచింగ్ గా ఉండేలా సినిమా ఉండబోతుంది. కొన్ని సీన్లు ఎడిట్ చేసేటప్పుడు సత్యరాజ్ నటన చూస్తే నాకే కన్నీళ్లు వచ్చాయి. రేపు థియేటర్స్ లో ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. ఇంత మంచి కథ యాక్సెప్ట్ చేసిన తేజు, రాశిలకు థాంక్స్. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అందించాలని మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి పని చేశారు. అలాగే ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నా స్నేహితులు బన్నీ వాసు, వంశీ, విక్కీలకు థాంక్స్.

అలాగే మా మెయిన్ పిల్లర్ అరవింద్.. ఆయనకు కథ చెప్పగానే మంచి కథ, చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. నా 'భలే భలే మొగాడివోయ్' స్క్రిప్ట్ మొదట చిరంజీవికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 'ప్రతి రోజు పండగే' స్క్రిప్ట్ కూడా చిరంజీవికి చెప్పాను. మంచి హెల్తీ స్క్రిప్ట్ తీసుకున్నావ్ అన్నారు. ఆయన ఇచ్చిన ఎనర్జీ తో ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ చేసుకున్నాం. మంచి మ్యూజిక్ అందించిన థమన్ సహా ప్రతి ఒక్క టెక్నీషన్స్ కి థాంక్స్. మిగతా పాటలు కూడా అన్ని వర్గాల వారికి ఆకట్టుకుంటాయి.” అన్నారు.

Next Story