ముఖ్యాంశాలు

  • రాజ్యసభకు ప్రశాంత్‌ కిషోర్‌.?
  • టీఎంసీ అధినేత్రి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
  • మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు

హైదరాబాద్‌: రాజకీయ ఎన్నికల వ్యుహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారా అంటే.. అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని మాత్రం ప్రశాంత కిషోర్‌ తీసుకోలేదట. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ పార్టీ తరఫున పీకేను రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ చీఫ్‌, సీఎం మమతా బెనర్జీ నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడన్న కారణంగా.. గత ఫిబ్రవరి నెలలో జనతాదళ్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే.

త్వరలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ప్రశాంత్‌కిషోర్‌.. బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్‌కు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో టీఎంసీ తరఫున గొంతు వినిపించడానికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రశాంత్‌ కిషోర్‌తో పాటు దినేశ్‌ త్రివేది, మౌసమ్‌ నూర్‌లు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని తృణమూల్‌ వర్గాలు అనుకుంటున్నాయి.

తృణమూల్‌ పార్టీకి చెందిన మనీష్‌గుప్తా, జోజెన్‌చౌదరీ, అహ్మద్‌ హసన్‌ ఇమ్రాన్‌, కేడీ సింగ్‌ల రాజ్యసభ పదవీకాలనం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 26న ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.