మహిళకు క్షమాపణ చెప్పిన పాప్ ఫ్రాన్సిస్.. ఎందుకంటే.?
By Newsmeter.Network Published on 2 Jan 2020 9:54 AM ISTన్యూయర్ వేడుకల్లో ఆశీర్వాదం కోరిన ఒక మహిళను చేతిపై కొట్టిన ఘటన దుమారం రేగడంతో పోప్ ఫ్రాన్సిస్ దిగొచ్చారు. క్షమాపణలు చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ మంగళవారం చిన్నారులు, భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వారి మధ్యలో నడుస్తున్నారు. సరిగ్గా ఒక మహిళ దగ్గరకు వచ్చేసరికి ఆయన కరచాలనం చేయకుండా వెళ్ళిపోబోయారు. దీనితో ఈ గుంపులో నుంచి ఓ మహిళ ఆయన చేతిని పట్టుకుని తన వైపునకు లాగింది. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామంతో ఆయన కాస్త అసహనానికి లోనయ్యారు. పాప్ చేతిని వెనక్కి తీసుకోవటానికి ప్రయత్నించినా ఆమె వదలకపోవటంతో మహిళ నుంచి తన చేతిని విడిపించుకునే క్రమంలో ఆమె చేతిపై ఒక దెబ్బ వేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటన సమయంలో ఆమె పోప్ చేయిని తాకే ముందు ఆయనకు ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఏం చెప్పిందో స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పోప్ ఫ్రాన్సిస్ తీరుపై విమర్శలు రావడంతో.. ఎట్టకేలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అనేక సార్లు మనం సహనం కోల్పోతుంటామని ఆయన అంగీకరించారు. అది తనకు కూడా జరిగిందన్నారు.