పాలమూరు ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా జరగలేదు: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  7 Sep 2023 1:15 PM GMT
YS Sharmila,  cm kcr, palamuru project ,

పాలమూరు ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా జరగలేదు: షర్మిల

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ పిట్టల దొర వింతలు అన్నీ ఇన్నీ కావని పేర్కొన్నారు. పాలమూరు ఓట్లు దక్కించుకునేందుకు దొర తొందరపడుతున్నాడని విమర్శించారు. ఇప్పటి వరకు సగం పనులు కూడా జరగని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. ఇంకా పూర్తికాని రిజర్వాయర్లకు పూజలు, కాలువలు తవ్వకుండానే ఊరూరా ఉత్సవాలట అంటూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

స్వరాష్ట్రంలో ప్రారంభించిన తొలి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశాడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు గుమ్మరించి పాలమూరుకు శఠగోపం పెట్టారని అన్నారు. దాంతో పాలమూరు ప్రాజెక్టు పనులు ఆపేశారని.. ప్రాజెక్టు మూలనపడిందని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామమాత్రపు పనులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు షర్మిల. అలా పాలమూరు ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యిందనే భ్రమను సృష్టించి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల అన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కనీసం 50 శాతం కూడా జరగలేదని అన్నారు. అంజనాపూర్ మొదటి రిజర్వాయర్‌లో 90 శాతం పనులే పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి చేసినట్లు నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. నార్లాపూర్ వద్ద 9 మోటార్లలో ఒక్కటే వాడుకలో ఉంది. భూ నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదన్నారు. పాలమూరు గ్రామాల్లో చేయాల్సింది సంబరాలు కాదనీ.. బందిపోట్లకు బడితె పూజలు అని షర్మిల అన్నారు. కేసీఆర్ చేస్తున్నవన్నీ ఎన్నికల స్టంట్‌గానే భావిస్తున్నామని షర్మిల అన్నారు. దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో భయం పట్టుకుందని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

Next Story