పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వ వ్యవహారం దుర్మార్గం: షర్మి
కపడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 6:08 AM GMTపెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వ వ్యవహారం దుర్మార్గం: షర్మిల
కపడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. షర్మిల తన సొంత అన్న సీఎం జగన్‌పై మరోసారి మండిపడ్డారు.
వృద్ధులకు పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం అని వైఎస్ షర్మిల అన్నారు. బ్యాంకుల వద్దకు క్యూ కట్టి పెన్షన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అసలే ఎండలు దంచికొడుతున్న వేళ బ్యాంకుల వద్ద నిలబడటంతో అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఏమైనా పెట్టుకుందా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మరోవైపు ఎన్నికల వేళ ఐఏఎస్ అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి బానిసలుగా ఉండాల్సిన అవసరం ఐఏఎస్‌లకు ఏముందని షర్మిల నిలదీశారు. వైసీపీకి మేలు చేయాలని నెలనెలా జనాలను పొట్టన పెట్టుకుంటారా? అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలూ సంతోషంగా లేరని వైఎస్ షర్మిల అన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22వేల కోట్లు బకాయి పడిందంటూ విమర్శించారు. మెడికల్ బిల్లులను కూడా పెండింగ్‌లో పెట్టారని అన్నారు. ప్రభుత్వానికి ఎన్నిమార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదని అన్నారు. ఉద్యోగులకు 11వ పీఆర్సీ ప్రకారం ఇవ్వాల్సిన ఐఆర్‌లో కూడా కోతపెట్టారంటూ వైఎస్ షర్మిల చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో వైసీపీ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.