జగన్ కుంభకర్ణుడు.. నాలుగున్నరేళ్లు నిద్రపోయాడు: వైఎస్ షర్మిల
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి
By Srikanth Gundamalla Published on 7 April 2024 9:47 AM GMTజగన్ కుంభకర్ణుడు.. నాలుగున్నరేళ్లు నిద్రపోయాడు: వైఎస్ షర్మిల
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ అన్ని వ్యూహాలను అమలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాద్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ షర్మిల తన సొంత అన్న, సీఎం జగన్‌పై గట్టిగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోమారు సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఏపీ న్యాయ యాత్ర నిర్వహిస్తున్నారు వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే షర్మిల యాత్ర నందిమండలం గ్రామానికి చేరుకుంది. అక్కడ షర్మిలకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించానని చెప్పారు. భూమి కోసం అవినాశ్ రెడ్డి అనుచరులు ఆయన్ని హత్య చేశారని అన్నారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపారని అన్నారు. అంతేకాదు.. అతడి తమ్ముడిని కూడా ట్రాక్టర్‌తో తొక్కించాలని చూశారని షర్మిల ఆరోపించారు. ఇక మరోవైపు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తే హత్యలు చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి లేదని షర్మిల అన్నారు. గతంలో వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులకే దిక్కలేదని అన్నారు. కడప స్టీల్ వైఎస్సార్ కల అనీ.. దాన్ని పూర్తి చేసి ఉంటే 25వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని షర్మిల అన్నారు. రాష్ట్రంలో శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప ప్రాజెక్టులు ముందుకు వెళ్లడం లేదన్నారు. జగన్ మోహన్‌రెడ్డి కుంభకర్ణుడు అనీ.. నాలుగున్నర ఏళ్లు నిద్రపోయి.. ఇప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వివేకా హత్య జరిగి ఐదేళ్లు పూర్తయినా దోషులకు శిక్ష పడలేదన్నారు. హత్య చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని అన్నారు. అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు నిందితుడు అని చెప్పారనీ.. అలాంటి వ్యక్తికి జగన్ టికెట్ ఇచ్చారని అన్నారు. ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించడమే అన్నారు. నిందితులను దగ్గరుండి మరీ కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచన చేసుకోవాలనీ.. వైఎస్ బిడ్డగా తాను ఒకవైపు.. వివేకాను హత్య చేసిన నిందితుడు ఒక వైపు ఉన్నాడని ఆమె అన్నారు. తనని గెలిపిస్తే నమ్మకంగా సేవ చేస్తానని వైఎస్ షర్మిల అన్నారు.