ఆ మూడే మెయిన్ టార్గెట్!

YCP focus on those three positions.వైఎస్సార్సీపీ నాయకత్వం రాబోయే ఎన్నికల కోసం వ్యూహరచన ప్రారంభించింది.

By సునీల్  Published on  11 Sep 2022 8:56 AM GMT
ఆ మూడే మెయిన్ టార్గెట్!
  • టీడీపీ ముఖ్య నాయకులే లక్ష్యం
  • ఫోకస్ సారించిన వైఎస్సార్సీపీ

వైఎస్సార్సీపీ నాయకత్వం రాబోయే ఎన్నికల కోసం వ్యూహరచన ప్రారంభించింది. ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో టఫ్ సీట్లలో విజయం సాధించేందుకు అడుగులు కదుపుతోంది. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో వైసీపీ పరిస్థితి మెరుగ్గానే ఉండటంతో కీలక స్థానాలపై దృష్టి సారించింది. విజయం ఎలాగూ ఖాయమైనప్పుడు అది మరింత ఘనంగా ఉండాలనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. అందుకోసం రాష్ట్రంలో కీలక స్థానాలైన మూడింటిపై ఫోకస్ పెట్టింది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఏడు సార్లుగా గెలుస్తూ వస్తున్నారు. మాజీ సీఎంగా ఉన్న బాబును అక్కడ ఓడించడం అంత ఈజీ ఏం కాదు. ఆ స్థానంలో గెలవగలిగితే టీడీపీని అన్ని రకాలుగా బలమైన దెబ్బ కొట్టినట్లే. అలాగే మాజీ సీఎం తనయుడు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించబోతున్న మంగళగిరి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డిపై లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఓడిపోయిన రోజు నుంచే లోకేష్ కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలోని ఇంటింటినీ చుట్టేస్తున్నారు. ఇక మూడోది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి. కింజరాపు కుటుంబానికి మంచి పట్టున్న టెక్కలిలో గెలుపు వైసీపీని ఊరిస్తోంది. ఈ మూడింటిలో ఎలాగైనా గెలవాలనేది అధికార పార్టీ లక్ష్యం.

టార్గెట్ పెట్టుకున్న 3 నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబుపై బరిలోకి నిలిచే కేఆర్‌జే భరత్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు సీఎం జగన్. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయిన విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.చంద్రమౌళి కుమారుడే భరత్. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రాధాన్యం కల్పించడంతోపాటు కుప్పం నియోజవర్గానికి అధిక నిధులు కేటాయించడం ద్వారా అధికార పార్టీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా భరత్ నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారు.

మంగళగిరిలో లోకేష్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ అధిష్టానం రకరకాల ఎత్తులు వేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే బలంగా ఉన్నప్పటికీ అక్కడి అన్ని సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను వైసీపీలో చేర్చుకున్నారు. తాజాగా బీసీ నేత గంజి చిరంజీవికి కండువా కప్పారు. రాజధాని సెంటిమెంట్‌తో టీడీపీ ప్రచారం చేస్తుంటే.. సామాజిక సమీకరణాలతో వైసీపీ దూసుకెళ్తోంది.

ఉత్తరాంధ్రలో కింజరాపు కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న టెక్కలిలో అచ్చెన్నను ఢీకొట్టేందుకు దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కింజరాపు రామ్మోహన్నాయుడుపై ఓడిపోయారు దువ్వాడ. వైసీపీలో దూకుడుగా వ్యవహరించే నేతల్లో ఒకరైన శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి, అచ్చెన్నకు చెక్ పెట్టేలా వ్యూహం పన్నారు జగన్. ఎమ్మెల్సీ పదవి దక్కిన దువ్వాడ కూడా మరింత స్పీడ్ పెంచి టెక్కలిలో అంతా తానై అయి వ్యవహరిస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించడం ద్వారా టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టాలని ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోంది వైసీపీ.

Next Story