లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
ఇటీవల వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 21 Aug 2023 4:56 PM ISTలోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
ఇటీవల వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అగ్రనాయకులను కలిశారు. తాజాగా గవన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్‌లో లోకేశ్ సమక్షంలో పసుపు కండువా కప్పుకుని టీడీపీలో చేరారు. టీడీపీలో చేరడానికి ముందు లోకేశ్‌తో సమావేశం జరిగింది. ఆ తర్వాతే యార్లగడ్డను పార్టీలోకి ఆహ్వానించారు లోకేశ్. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, పంచుమర్తి అనురాథ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన యార్లగడ్డకు తెలుగు దేశం నాయకులందరూ శుభాకాంక్షలు తెలిపారు.
యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఆయన కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అంతేకాక... తన నియోజకవర్గ అభివృద్ధికి పార్టీ ఏం చేయడం లేదని.. తనని అవమానించారని తెలిపారు. పార్టీలో ఉంటే ఉండు లేదంటే వెళ్లిపో అంటూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్పల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలుపొందిన విషయం తెలిసిందే.
అయితే.. టీడీపీలో గెలిచిన వంశీ వైసీపీకి దగ్గర అయ్యారు. దాంతో.. యార్లగడ్డ గన్నవరం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. మరోసారి పోటీచేసి గెలించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు అందుకోసం టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని.. పార్టీలో చేరతానని చెప్పారు. ఈ క్రమంలోనే యార్లగడ్డ, వంశీ మధ్య పోరు ఉండే అవకాశాలు ఉన్నాయి. టీడీపీలో యార్లగడ్డ చేరడంతో గన్నవరం టికెట్ యార్లగడ్డకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.