టీడీపీకి రాజీనామా.. కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla
టీడీపీకి రాజీనామా.. కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తన నిర్ణయాన్ని తెలిపారు కేశినేని నాని. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన కేశినేని నాని.. 'అందరికీ నమస్కారం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేతను పార్టీలో కొనసాగడం సరికాదని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోక్‌సభ స్పీకర్ గారిని కలిస్తాను. నా లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింప చేసుకుంటారు. ఆ తర్వాత వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను' అని కేశినేని సంచలన ప్రకటన చేశారు.
అయితే.. రాజీనామా ప్రకటనకు ముందు టీడీపీలో కేశినేని ఎపిసోడ్ తీవ్ర దుమారం రేపింది. తిరువూరు సభ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ కొనసాగింది. అది మరింత ముందరడంతో చంద్రబాబు ఆదేశాలతో తనని టీడీపీ నేతలు కలిశారనీ.. తిరువూరు సభకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ నాయకులు తనతో తెలిపారనీ కేశినేని నాని అన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కూడా మరొకరికి ఇస్తామని తనతో చెప్పారనీ.. పార్టీ విషయంలో జోక్యం చేసుకోవద్దనీ చెప్పారన్నారు కేశినేని నాని. అయితే.. మొదట పార్టీ అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పిన కేశినేని నాని అంతలోనే పార్టీకి రాజీనామా చేసే నిర్ణయం తీసుకున్నారు.