యూపీఏ కూటమి పేరు మార్పు ఖాయమేనా? కారణాలేంటి..?
యూపీఏ కూటమి పేరు మార్చాలని పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 July 2023 1:20 PM GMTయూపీఏ కూటమి పేరు మార్పు ఖాయమేనా? కారణాలేంటి..?
భారత రాజకీయాల్లో కూటములే ప్రాధాన భూమిక పోషిస్తున్నాయి. ఇప్పటివరకు చూసుకుంటే జాతీయంగా రెండు కూటములు ఉన్నాయి. ఒకటి యూపీఏ అయితే.. మరొకటి ఎన్‌డీఏ. యూపీఏ అంటే యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్, ఎన్‌డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. అయితే.. యూపీఏలో కాంగ్రెస్ ప్రధాన పార్టీ కాగా.. ఎన్డీఏలో బీజేపీ ప్రధాన పార్టీ. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుకి ఈ రెండు జాతీయ పార్టీలకు సహకరిస్తుంటాయి.
2004 కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దాంతో.. యూపీఎ కూటమి ఏర్పడింది. ఇందులో వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎన్డీఏ కూటమికి 181 సీట్లు ఉండగా.. యూపీఏ కూటమి 218 సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2004 నుంచి 2014 వరకు యూపీఏ కూటమే కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి ఓటమి పాలైంది. తర్వాత రెండో సారి కూడా ఎన్డీఏనే అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో యూపీఏ కూటమి రాబోయే 2024 ఎన్నికల్లో మరింత సత్తా చాటి... కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కొత్త పార్టీలను చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది.
అయితే.. యూపీఏ కూటమిలో మొత్తం 19 పార్టీలు ఉన్నాయి. కూటమి పేరు మార్చాలని పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా ప్రస్తుతం యూపీఏలో చేరాలని భావిస్తున్నాయి. దాంతో.. ఆ పార్టీలు యూపీఏ పేరుని మార్చాలని కోరుతున్నాయి. ఈ క్రమంలోనే కూటమి పేరును మార్చేందుకు పార్టీలన్నీ ఏకమై సమావేశంలో చర్చించేందుకు సిద్ధమవుతున్నాయి. బెంగళూరులో రెండ్రోజుల పాటు జరుగుతున్న సమావేశాల్లో కూటమికి కొత్త పేరు ప్రతిపాదనను తీసుకురానున్నారు. అన్ని పార్టీలతో మంతనాలు జరిపిన తర్వాత ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 18న జరిగే మెగా ప్రతిపక్ష సమావేశంలో కొత్త పేరుని నిర్ణయించే అవకాశం ఉందని ఆయా పార్టీల నాయకులు అంటున్నారు. అభ్యంతరాలు, ఆలోచనలు పరిగణనలోకి తీసుకుని చర్చించి, ఆ తర్వాత ఆమోదించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
కొత్త పేర్లతో భిన్న కూటములు ఉండటం సరికాదని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. పూర్తిగా పేరు మార్చకుండా యూపీఏ పేరునే కాస్త మార్చి మరో కొత్త పేరుతో ముందుకు రావాలని ఆలోచనలో ఉన్నారు. పీడీఏ అంటే పేట్రియాటిక్ డెమొక్రిటిక్ అలయన్స్ అని పేరు పెడతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి యూపీఏ కూటమి సమావేశాల్లో ఇదే పేరుని ఖరారు చేస్తారా..? లేదంటే మరేదైనా పేరుని ఖరారు చేస్తారా అన్నది వేచి చూడాలి.