ఎమ్మెల్యే రఘునందన్‌పై దుబ్బాక బీజేపీ నేతల అసహనం
తెలంగాణ బీజేపీలో అంతర్గత వ్యవహారాలు కలవరం సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 8 July 2023 8:25 AM ISTఎమ్మెల్యే రఘునందన్‌పై దుబ్బాక బీజేపీ నేతల అసహనం
తెలంగాణ బీజేపీలో అంతర్గత వ్యవహరాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఈటల రాజేందర్ పార్టీ మరతారన్న వార్తలు కలవర పెట్టాయి. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వ మార్పుల్లో భాగంగా ఆయనకు మంచి బాధ్యతలు అప్పజెప్పింది అధిష్టానం. అయినా ఇంకా కొందరు అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యవహారం బీజేపీ నేతల్లో అసహనాన్ని రేపుతోంది. ఇటీవల రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు పార్టీ మొత్తాన్ని కించపర్చేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్‌పై కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల ముందు వరకు తెలంగాణలో బీజేపీ మంచి స్పీడ్ మీద ఉంది. అన్ని కార్యక్రమాల్లో నాయకులు చురుగ్గా పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అప్పట్నుంచి బీజేపీ చతికిలపడిపయిందనే చెప్పాలి. పార్టీ ముఖ్య నేతలు ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. పార్టీలో అంతర్గత పోరు ఉందని రాజకీయంగా గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు కీలక నేతలు అయితే కంటికి కూడా కనిపంచకుండా పోయారు. పార్టీలోనే ఉన్నా .. బీజేపీ కార్యక్రమాలతో తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ బీజేపీలో నేతల మాటలు ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటీవల జితేందర్‌రెడ్డి ట్వీట్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయన ఏకంగా పార్టీ నాయకత్వాన్నే విమర్శిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దుబ్బాక ఉపఎన్నికల్లో తనకు ఎవరూ అండగా నిలవలేదన్నారు. అంతేకాదు.. తన ఇమేజ్‌తోనే దుబ్బాకలో గెలిచానని అన్నారు. బీజేపీ అగ్రనేతల ముఖం చూసి ఓట్లు వేయలేదని.. తనని చూసే దుబ్బాక ప్రజలు ఓట్లు బీజేపీకి వేశారని కామెంట్ చేశారు. రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రఘునందన్ కామెంట్స్‌తో తెలంగాణ బీజేపీలో లుకలుకలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది.
దుబ్బాకలో బీజేపీని గెలిపించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, నేతలు వెళ్లి కష్టపడ్డారు. ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడారు. అలాంటిది రఘునందన్‌రావు గెలుపుని తన ఒక్కరి ఖాతాలోనే వేసుకోవడంతో దుబ్బాక బీజేపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో కష్టపడి పని చేస్తే కనీసం గుర్తింపు కూడా ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రఘునందన్‌రావుకి వ్యతిరేకంగా దుబ్బాక బీజేపీ నేతలు ఏకం అయినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైనట్లు సమాచారం. రఘునందన్‌రావుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకే నష్టమని బీజేపీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా రఘునందన్‌రావు కామెంట్స్ దుబ్బాకలో కాక రేపుతున్నాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తారా? లేదంటే రఘునందన్‌రావు ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారా? ఎలా స్పందించనున్నారో చూడాలి.