ఎన్నికల వేళ ఐటీ, ఈడీ దాడులపై స్పందించిన రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 1:40 PM ISTఎన్నికల వేళ ఐటీ, ఈడీ దాడులపై స్పందించిన రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, ఈడీ సోదాల గురించి ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టానలి చూస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు అంతా గమనించాలని.. ఎన్నికల్లో రెండు పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని లేఖలో రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలు రెండూ కుమ్మక్కు అయ్యాయని అన్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ నేతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలను.. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను మోదీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చారంటూ మండిపడ్డారు. ఆ రెండు పార్టీల్లో చేరినవారు పవిత్రులు.. ఇతర పార్టీల్లో ఉన్నవారంతా ద్రోహులా అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారనీ.. ప్రశ్నించే గొంతుక లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా ఐటీ, ఈడీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.. వీటి వెనుక ఎవరి హస్తం ఉందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఐటీ, ఈడీ అధికారులకు ఎక్కడి నుంచి అందుతున్నాయో చెప్పాలన్నారు. ఎన్నికల వేళే ఎందుకు దాడులు చేయిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను లేఖ ద్వారా కోరారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కేసీఆర్, అమిత్‌షా కలిసి ప్రణాళిక రచించారనీ ఆరోపించారు. పీయూష్ గోయల్ దాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం కుంగి అవినీతి బయటపడ్డా.. ఆ సంస్థలు కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించవంటూ రేవంత్‌రెడ్డి నిలదీశారు.
అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందన్నారు రేవంత్‌రెడ్డి. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పతనం ప్రారంభం అయ్యిందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలను మీరెంత ఇబ్బంది పెట్టినా..ఎన్ని దాడులు చేసినా రేపటి కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.