హరీశ్‌రావు ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్‌రెడ్డి
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటోన్న హరీశ్‌రావు చరిత్ర చదువుకుంటే మంచిదంటూ హితవు పలికారు సామ రామ్మోహన్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 26 Oct 2023 5:45 PM ISTహరీశ్‌రావు ఓడిపోతామనే ఫ్రస్టేషన్‌లో ఉన్నారు: కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్‌రెడ్డి
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఆయా పార్టీల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది. అధికారం చేపట్టేందుకు ప్రధాన పార్టీలు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తుంటే.. దానికి అధికార పార్టీ కౌంటర్లు వేస్తోంది. తాజాగా మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకమంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో రైతులకు ఏం చేయడం లేదంటూ విమర్శలు చేశారు హరీశ్‌రావు. తాజాగా ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి. హరీశ్‌రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటోన్న మంత్రి హరీశ్‌రావు ఓ సారి చరిత్ర చదువుకుంటే మంచిదంటూ హితవు పలికారు సామ రామ్మోహన్‌రెడ్డి. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోతుందనే ఫ్రస్టేషన్‌లోనే మంత్రి హరీశ్‌రావు అలా మాట్లాడుతున్నారని చెప్పారు. ధరణి దగా తెచ్చి పేదోడి భూములను లాక్కున్నది బీఆర్ఎస్ కాదా అని సామ రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుబంధు పథకం తమే అని చెబుతున్న బీఆర్ఎస్.. 2014 కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఆర్థిక సాయం రూ.10వేలు ప్రకటించిన విషయం మర్చిపోయారా అన్నారు. ప్రతిసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొడుతోందంటూ సామ రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి మయం చేశారని ఆరోపించారు. మానవకట్టడం శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ..? ఎలాంటి వరదలు లేకుండా కుంగిన మెడిగడ్డ ప్రాజెక్టు ఎక్కడ..? అని ప్రశ్నించారు సామరామ్మోహన్‌రెడ్డి. రైతులకు విత్తనాలు, ఎరువులు, పనిముట్లపై సిబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. రైతు సంక్షేమంపై మాట్లాడే హక్కు మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నాయకులకు ఎవ్వరికీ లేదంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు నీళ్లలో పోశారని చెప్పారు. కాళేశ్వరం కూలిపోతుంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వరికి రూ.500 బోనస్ ఇస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ మొదటగా అమలు చేసింది కాంగ్రెస్సే అన్నారు సామ రామ్మోహన్‌రెడ్డి. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న కేసీఆర్‌కు రైతుల నుంచి వ్యతిరేకత తప్పడం లేదని అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా రైతులు నామినేషన్లు వేయబోతున్నారని చెప్పారు. తెలంగాణ గల్లీలో మార్మోగుతున్న నినాదం 'సారు కారు మళ్లీ రారు'అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.