కేసీఆర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువే ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్ నుంచి టికెట్ అందని నాయకులు ఎవరూ నిరాశ చెందొద్దని కోరారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 8:07 AM GMTకేసీఆర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువే ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను తొలి జాబితా కింద 55 మందిని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ లిస్ట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో విడుదల అయ్యిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీట్లాడారు. తొలి జాబితాలో 55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీలకు 3 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అయితే.. బీసీలకు 12 సీట్లు తొలి జాబితాలో వచ్చాయని.. తర్వాతి జాబితాలో కూడా ఇంకా కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే నాలుగు సీట్లు ఎక్కువే కేటాయిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
అయితే.. కాంగ్రెస్ నుంచి టికెట్ అందని నాయకులు ఎవరూ నిరాశ చెందొద్దని కోరారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అందరి కలిసి కట్టుగా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అందుకు కోసం కలిసి పనిచేద్దామన్నారు. బీఆర్ఎస్ ప్రభత్వం ఎన్ని కేసులు పెట్టిన కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారని చెప్పారు. టికెట్లు దక్కని వారికి ఇతర పదవులు వస్తాయని.. వారిని అధిష్టానం పెద్దల వద్దకు తీసుకెళ్లి కలిపిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ.. ఎంపీ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇలా చాలా పదువుల ఉంటాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. టికెట్ రాని వారు ఆయా నియోజవకర్గాల్లో టికెట్ లభించిన వారితో కలిసి పనిచేసి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. లెఫ్ట్ పార్టీలతో సీట్ల కేటాయింపుపై జాతీయ స్థాయిలో ప్రయోజనాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడం బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టికెట్స్ అమ్ముకుంటారంటూ నిందలు వేయడం సరికాదని సూచించారు. పొన్నాలకు గుర్తింపు వచ్చింది కాంగ్రెస్‌తోనే అనేది గుర్తు ఉంచుకోవాలని చెప్పారు. నీడను ఇచ్చిన చెట్టును నరుక్కోవద్దన్నారు. టికెట్స్ ఇచ్చేది హై కమాండ్ అని, దానికి రాష్ట్ర నాయకత్వాన్ని తిట్టడం సరికాదన్నారు. అయితే.. తెలంగాణలో 70 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాఉ చేయబోతుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.