ఏపీలో జగన్ పనైపోయింది.. వైసీపీ ఎంపీలే చెప్తున్నారు: లోకేశ్
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 1:45 PM GMTఏపీలో జగన్ పనైపోయింది.. వైసీపీ ఎంపీలే చెప్తున్నారు: లోకేశ్
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అంటే కార్యకర్తలే అని స్పష్టం చేశారు. అయితే పార్టీలోకి కొందరు నేతలు వచ్చారు.. వెళ్లారు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పార్టీకి అండగా ఉన్నది మాత్రం కార్యకర్తలే అన్నారు నారా లోకేశ్.
ఇక వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఏపీలో సీఎం జగన్ పని అయిపోయిందనీ.. ఈ విషయం తన మాట కాదు ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారని లోకేశ్ అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారనీ.. కాని అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రధాని మోదీని ఎన్నోసార్లు కలిసినా.. ఒక్క సారి కూడా హోదా గురించి మాట్లాడలేకపోయారా అని ప్రశ్నించారు నారా లోకేశ్. పార్లమెంట్‌లో వైసీపీ 31 మంది సభ్యులు ఉన్నా.. వారు రాష్ట్రం కోసం ఎప్పుడూ పోరాడలేదని విమర్శించారు. సొంత కేసులు కోసం హోదాను తాకట్టు పెట్టారని వైసీపీ ఎంపీలు అంటున్నట్లు చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా జగన్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని నారా లోకేశ్ అన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి అధికారంలోకి రాబోతున్నాయని లోకేశ్ చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు పవనన్న కలిసి 'బాబు సూపర్-6' ప్రకటించారని అన్నారు. ప్రజల కష్టాలను తొలగించేందుకే ఈ బాబు సూపర్ -6 ప్రకటించినట్లు చెప్పారు.
1. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
2. ఉద్యోగం వచ్చే వరకు సమయం పడితే.. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు ఇస్తాం
3. స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం
4. ఇబ్బందుల్లో ఉన్న రైతును ఆదుకునేందుకు ప్రతి ఏటా రూ.20వేలు ఇస్తాం
5. ప్రతి కుటుంబాన్ని ఉచితంగా 5 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం
6. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తాం