బాబే వ్యూహకర్త!

TDP changes strategy.దేశంలో ఎన్నికల రూటు మారిపోయింది. గతంలో అనుసరించిన సంప్రదాయ వ్యూహాలకు కాలం చెల్లిపోయింది

By సునీల్  Published on  7 Aug 2022 3:35 AM GMT
బాబే వ్యూహకర్త!
  • స్ట్రాటజిస్టులకు గుడ్ బై చెప్పిన టీడీపీ
  • సొంత టీంతోనే సర్వేలు, విశ్లేషణలు

దేశంలో ఎన్నికల రూటు మారిపోయింది. గతంలో అనుసరించిన సంప్రదాయ వ్యూహాలకు కాలం చెల్లిపోయింది. 2014 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రశాంత్ కిషోర్(పీకే) అనే వ్యూహకర్త పేరును తెరపైకి తెచ్చింది. పీకే టీం రాజకీయ ప్రచారంలో తెచ్చిన మార్పులతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఉప ఎన్నికలకు నగారా మోగినా వ్యూహకర్తలకు పిలుపు అందుతోంది. ఎన్నికల ముందు సర్వేలు, తర్వాత ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఆ పనిని కూడా వ్యూహకర్తలే చేసేస్తున్నారు. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ కోసం పీకే టీం పని చేస్తోంది. ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం ఇటీవల వరకు కొనసాగించిన స్ట్రాటజిస్టులకు గుడ్ బై చెప్పేసింది. తమ పార్టీకి చంద్రబాబే వ్యూహకర్త అని నాయకులు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో 175 స్థానాలకు, 151 కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పీకే టీం పని చేసింది. అయితే ఎన్నికల తర్వాత కూడా ఆ టీంను కొనసాగిస్తూ.. అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహకర్తను నియమించుకోవాలని భావించింది. పీకే టీంలోనే పని చేసిన రాబిన్ శర్మతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబిన్ శర్మ టీం రాష్ట్రమంతా పర్యటించి, సర్వే నివేదికలు, పార్టీలోని అంతర్గత విభేదాలు, లోపాలపై వివరణలు ఇచ్చింది. రాబోయే ఎన్నికల కోసం చేయాల్సిన పలు మార్పులనూ సూచించింది. అయితే వ్యూహకర్తల సమాచారంతో సంతృప్తి చెందని టీడీపీ అధిష్టానం వారికి గుడ్ బై చెప్పింది. వారు చేసిన సూచనలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆమోదం తెలపకపోవడంతోనే ఒప్పందం రద్దయిందనే ప్రచారం కూడా ఉంది.

అనంతరం పీకేతోపాటు పని చేసిన సునీల్ కనుగోలుతో టీడీపీ ఒప్పందం చేసుకుంది. వ్యూహకర్తగా పలు రాష్ట్రాల్లో మంచి విజయాలు సాధించిన సునీల్ టీం టీడీపీకి పలు సూచనలు చేసింది. ఈ రెండు బృందాలు సోషల్ మీడియాలో ప్రచారంపై ఎక్కువ ఫోకస్ పెట్టాయి. అలాగే పలువురు అభ్యర్థులను మార్చాలని సూచించాయి. కార్యకర్తల స్థాయి నుంచి పార్టీలోని బలహీనతలపై నివేదికలు ఇచ్చాయి. అయితే వ్యూహకర్తల సూచనలను పార్టీ నాయకత్వం లైట్ తీసుకుందని కొందరు నాయకులే చెబుతున్నారు. చాలా అంశాలను అమలు చేయడానికి అధిష్టానం అంగీకరించలేదని అంటున్నారు. ఇదే సమయంలో సునీల్ టీంకు కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది. జాతీయ స్థాయిలో, పలు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. దీంతో సునీల్ టీంకూ టీడీపీ రాంరాం చెప్పేసింది.

జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో మంచి పట్టున్న చంద్రబాబుకు వ్యూహకర్తలతో పని లేదని నాయకులు చెబుతున్నారు. బాబుకు ఉన్న 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాబోయే ఎన్నికలకు ఉపయోగపడుతుందంటున్నారు. వ్యూహకర్తలు చెప్పినవి రాష్ట్రంలో పని చేయవని, బాబు వ్యూహమే విజయం సాధించి పెడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రెండేళ్లు బస్సు యాత్ర, ప్రజా యాత్రల పేరుతో జనంలోకి వెళ్లాలనే ఆలోచన ఉందంటున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం టీడీపీలో లేదని, కానీ ఈసారి మాత్రం ముందుగానే అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు సీనియర్ నాయకులు చెబుతున్నారు.

Next Story