రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన హీరో దళపతి విజయ్‌

తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.

By Srikanth Gundamalla  Published on  2 Feb 2024 2:07 PM IST
tamil, star hero, vijay, new poitical party,

 రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన హీరో దళపతి విజయ్‌ 

తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. హీరో దళపతి విజయ్‌ తమిళ్‌లోనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరో. ఆయన సినిమాలు ఇక్కడ కూడా నేరుగా డబ్‌ అవుతుంటాయి. విజయ్‌ సినిమాకు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు లభిస్తాయి. అయితే.. హీరో దళపతి విజయ్‌ రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిని నిజం చేశారు విజయ్. పార్టీ పేరును కూడా ప్రకటించారు.

కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ హీరో విజయ్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీని స్థాపించినట్లు చెప్పారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వబోదని కూడా స్ఫష్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని విజయ్ అన్నారు. అవినీతిపై వ్యతిరేకంగా పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పర్టీ పోటీ చేయబోదని అన్నారు. అలాగే ఎవరికీ మద్దతు కూడా ఇవ్వట్లేదని అన్నారు. 2026లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని దళపతి విజయ్‌ వెల్లడించారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తామని చెప్పారు.

తమిళనాడులో సూపర్‌ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. అభిమానులు ఆయన్ని ముద్దుగా దళపతి అని పిలుస్తారు. దళపతి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుపై పలువురితో సమావేశమై చర్చలు జరిపారు. ఇక ఆయన పార్టీకి సంబంధించి పలు పేర్లు కూడా వినిపించాయి. . ‘తమిళగ మున్నేట్ర కళగం’ పేరుతో ఆయన పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దీనికి స్వల్ప మార్పులు చేసిన ‘తమిళగ వెట్రి కళగం’ పేరును ఖరారు చేశారు.


Next Story