Tamilnadu: రీఎంట్రీకి టైమ్ వచ్చింది.. శశికళ కీలక ప్రకటన
అన్నాడీఎంకే పని అయిపోయిందని ఎవరూ భావించొద్దని శశికళ అన్నారు. తాను పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 12:30 PM ISTTamilnadu: రీఎంట్రీకి టైమ్ వచ్చింది.. శశికళ కీలక ప్రకటన
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పని అయిపోయిందని ఎవరూ భావించొద్దని చెప్పారు. తాను పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దాన్ని సమయం ఆసన్నమైందన్నారు శశిశకళ. పార్టీలో తన పునఃప్రవేశం మొదలైందని వెల్లడించారు. కాగా.. ఇటీవలే వెలువడ్డ లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐడీఎంకే పతనం అవుతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. తాము రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాణిస్తామనీ.. అమ్పాలనకు నాంది పలుకుతామని శశికళ చెప్పారు.
ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కె.పళనిస్వామి.. ప్రభుత్వాన్ని ఏ సమస్యల గురించి ప్రశ్నించడం లేదని శశికళ అన్నారు. ఇకపై ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం తన మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో శశికళ ఈ కామెంట్స్ చేశారు. కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పారు. తాను మళ్లీ వస్తున్నాననీ.. అన్నింటినీ చక్కదిద్దుతానని చెప్పారు. తమిళనాడు ప్రజలు తమవైపే ఉన్నారనీ.. ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెబుతున్నానని శశికళ అన్నారు. అన్నాడీఎంకే కథ ముగిసిందని అనుకోవద్దనీ.. తన ఎంట్రీ ప్రారంభమైందన్నారు.
అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలదే అనీ.. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత పార్టీని చెక్కు చెదరకుండా పరిరక్షించారని చెప్పారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని శశికళ అన్నారు. కుల రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదనీ.. ఇది కార్యకర్తలెవరూ సహించబోరు అని శశికళ వ్యాఖ్యానించారు. అందరినీ ఏకం చేసి అన్నాడీఎంకే పార్టీని బలోపేతం చేయడం తన లక్ష్యమని.. దీని కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు శశికళ వెల్లడించారు.