సోమువీర్రాజుకి బీజేపీ అధిష్టానం షాక్.. అధ్యక్ష పదవి నుంచి తొలగింపు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకి జాతీయ హైకమాండ్ షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 4 July 2023 9:39 AM GMTసోమువీర్రాజుకి బీజేపీ అధిష్టానం షాక్.. అధ్యక్ష పదవి నుంచి తొలగింపు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుకి జాతీయ హైకమాండ్ షాక్ ఇచ్చింది. సోమువీర్రాజుని ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సోమువీర్రాజుకి ఫోన్ చేసి చెప్పారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించినా.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సోమువీర్రాజుకు హామీ ఇచ్చారు. అయితే.. పదవి నుంచి అధిష్టానం తొలగించడంపై సోమువీర్రాజు ఇంకా స్పందించలేదు. 1978 నుంచి సోము వీర్రాజు బీజేపీలో ఉంటున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో 2020 జులై 27న ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక అయ్యారు.
కాగా.. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ పేరుని దాదాపు కమలపార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సోమువీర్రాజు తొలగింపుపై ప్రచారం జరుగుతున్నా.. చడీచప్పుడు లేకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చేశారు. సోమువీర్రాజుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలువురు బీజేపీ నాయకులు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. అంతేకాక రాబోయే ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రివర్గంతో పాటు.. రాష్ట్రాల అధ్యక్షులను మార్చే యోచనలో ఉంది బీజేపీ. ఈ క్రమంలోనే సోమువీర్రాజుని ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలోనే ప్రకటించనుంది బీజేపీ.
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు కూడా తథ్యమని అంటున్నారు పలువురు రాజకీయ నిపుణులు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ మార్పులు ఉండాలనే ఉద్దేశ్యంతోనే బండి సంజయ్‌ని కూడా తొలగిస్తారని భావిస్తున్నారు. అదీకాక బండి సంజయ్‌ని ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలుపునిచ్చింది. ముంబై పర్యటనలో ఉన్న బండి..హుటాహుటిన నిన్న ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అదనపు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.