బీఆర్ఎస్‌లో చేరిన తెలంగాణ టీడీపీ సీనియర్ నేత

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 Oct 2023 10:51 AM GMT
telangana tdp, ravula chandrasekhar, joined in brs,

 బీఆర్ఎస్‌లో చేరిన తెలంగాణ టీడీపీ సీనియర్ నేత 

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీలో ఉన్నవారికి టికెట్‌ ఆశించి దక్కకపోతే పక్క పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. కానీ.. తెలంగాణలో టీడీపీ పరిస్థితి వేరు. ఇప్పటి వరకు అభ్యర్తులను కూడా ప్రకటించలేదు. కానీ.. ఆ పార్టీకి తెలంగాణలో బిగ్‌ షాక్‌ తగిలింది. పార్టీలో తొలి నుంచి ఉన్న సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. టీడీపీతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధాన్ని తెంచుకుని గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్‌కు గులాబీ కండువా కప్పి మంత్రి కేటీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రావుల చంద్రశేఖర్‌ వనపర్తి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు. టీడీపీలో తొలి కాలం నుంచి పనిచేస్తున్నారు. ఆయన పార్టీ వీడటంతో తెలంగాణలో టీడీపీ బిగ్‌షాకే అని చెప్పాలి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి పెద్దగా మద్దతు లేదు. తాజాగా ఇలాంటి నాయకులు పార్టీ మారితే తెలంగాణలో టీడీపీకి మంచిది కాదని.. కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాగా.. ప్రస్తుతం టీడీపీ జాతీయ పాలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు రావుల చంద్రశేఖర్‌. కానాయ పల్లి గ్రామ సర్పంచ్‌గా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీలో చేరి.. అంచెలంచెలుగా ఎదిగారు. 1989 -1994 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో వనపర్తి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఓడినా.. 2001లో రాజ్యసభ సభ్యునిగా ఆయన్ను టీడీపీ నామినేట్ చేసింది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రావుల చంద్రశేఖర్.

తెలంగాణ ఆవిర్బావం తర్వాత.. ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా.. చంద్రబాబుకు నమ్మకంగా ఉంటూ ఆ పార్టీలోనే కొనసాగారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రావుల ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు. 40 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని రావుల చంద్రశేఖర్‌ బీఆర్ఎస్‌లో చేరిపోయారు. వ‌న‌ప‌ర్తి జిల్లాలో రావుల చంద్ర‌శేఖర్‌కు మంచి ప‌ట్టుంది.

Next Story