బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీల్లోకి వెళ్తున్నవారికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వార్నింగ్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 March 2024 11:24 AM GMTబీఆర్ఎస్ నుంచి వేరే పార్టీల్లోకి వెళ్తున్నవారికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వార్నింగ్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు వరుసగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇదే అంశంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నవారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని చెప్పారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి ఇతర పార్టీల్లోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. పార్టీ మారిన నాయకులను ప్రజలు చెప్పులతో కొడతారంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు అసలు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు వారికి నాయకులే లేరని అన్నారు. అందుకే బీఆర్ఎస్ వెంట పడుతున్నారని విమర్శించారు. ఇక పార్టీ మారిన వారికే టికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. కొందరు పిరికి పందెలు పార్టీ మారుతున్నారంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత లాభం కోసం రాజకీయాల్లో పనిచేయొద్దని సూచించారు. ఒక పార్టీలో గెలిచి మరోపార్టీలోకి వెళ్లడం అంటే ప్రజలను మోసం చేసినట్లే అవుతుందని అన్నారు. అక్రమాలు చేసినవారు పార్టీ మారితే వారి అక్రమాలను బీఆర్ఎస్సే బయటపెడుతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.
రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను నష్టాల్లో ముంచాయని పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఈ సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు భరోసా ఇవ్వకుండా బీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారికి వెంటనే ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తాము రైతుబంధు త్వరితగతిన రైతుల అకౌంట్లలో వేశామనీ.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు నిధులను రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల వేళ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.