ఎన్ని కుట్రలు చేసినా జనగామ BRS అభ్యర్థి నేనే: ముత్తిరెడ్డి
ఎవరెన్ని కుట్రలు చేసినా జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 1:21 PM ISTఎన్ని కుట్రలు చేసినా జనగామ BRS అభ్యర్థి నేనే: ముత్తిరెడ్డి
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో.. రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో అక్కడక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. అయితే.. సీఎం కేసీఆర్ ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తానని తెలపడంతో పలువురు ఎమ్మెల్యేలు దీమాతో ఉన్నారు. కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు పార్టీ ఎమ్మెల్యేలు. వారిలో కాస్త ఆందోళన నెలకొందనే చెప్పాలి. ఈ క్రమంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వారి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆశావాహులు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలోనే జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపైనా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన స్పందించారు. నియోజకవర్గంలోని పార్టీ విధానాలకు, తనకు వ్యతిరేకంగా కొందరు బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వారు చేస్తున్న కుట్రలను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వాటికి త్వరలోనే ముగింపు పలుకుతానని అన్నారు ముత్తిరెడ్డి. పలువురు బీఆర్ఎస్ నాయకులు ముత్తిరెడ్డిపై వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో మల్లాపూర్‌లో ఎమ్మెల్యేకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించారు.
సొంత పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా, వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని చెప్పారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకరాంతో జనగామ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేశానని చెప్పారు. అయితే.. కొందరు గ్రూపు రాజకీయాలు చేస్తూ.. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి వారి ఆగడాలు తన ముందు సాగవంటూ వార్నింగ్ ఇచ్చారు ముత్తిరెడ్డి. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు పైరవీలు చేసే నాయకులకు కాకుండా.. ముత్తిరెడ్డికే బీఆర్ఎస్ టికెట్ కేటాయించాలని తీర్మానం చేస్తూ కాపీలను ఎమ్మెల్యేకు అందజేశారు.