బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా
బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు మంత్రి రోజా.
By Srikanth Gundamalla Published on 8 Oct 2023 10:00 AM GMTబండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా
ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల్లో ఉన్న మహిళా నాయకులు, మహిళా ప్రముఖులు బండారు వ్యాఖ్యలను తప్పుబట్టారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా మరోసారి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై రోజా స్పందించారు.
ఆయన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు మంత్రి రోజా. న్యాయపరంగా పోరాడతానని పేర్కొన్నారు. చీడపురుగు లాంటి వ్యక్తి బండారు సత్యనారాయణమూర్తి అని.. అలాంటి వ్యక్తులను ఏరిపారేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మహిళను వ్యక్తిగతంగా దెబ్బతీసేలా ఒక్క మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలని చెప్పారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ నాయకులకు పిచ్చి ఎక్కిందని విమర్శించారు రోజా. మహిళలను కించపరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. అయితే.. చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే జైలుకు వెళ్లేవారు కాదని.. ఈ విషయం ప్రతి టీడీపీ నాయకుడు, రాష్ట్ర ప్రజలు గమనించాలని మంత్రి రోజా కోరారు. తప్పు చేశారు కాబట్టే జైలు నుంచి చంద్రబాబు బయటకు రాలేకపోతున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ తప్పిదాలను కవర్ చేసుకోవడానికే తనని టార్గెట్ చేసి.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రోజా అన్నారు. టీడీపీ, జనసేన నాయకులకు దిగజారుడు రాజకీయాలు మాత్రమే తెలుసని మంత్రి రోజా ఫైర్ అయ్యారు.
టీడీపీ బండారులా నీచంగా ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడలేదని అన్నారు మంత్రి రోజా. తన నియోజకవర్గంలో ఉన్న మహిళలకు, తన ఇంట్లో ఉన్న మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తాడో తెలుస్తోందని అన్నారు. మహిళల పట్ల బండారుకి ఉన్న సంస్కారం ఇదేనా అని మంత్రి రోజా నిలదీశారు. బండారు వంటి మగవారికి బుద్ధి చెప్పేందుకు న్యాయపోరాటం చేస్తానని మంత్రి రోజా అన్నారు.