సీటు ఇవ్వకున్నా సీఎం జగన్ వెంటే ఉంటా: మంత్రి రోజా
మంత్రి రోజాకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రోజా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 1:11 PM ISTసీటు ఇవ్వకున్నా సీఎం జగన్ వెంటే ఉంటా: మంత్రి రోజా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏపీలో ఎన్నికలపై అందరి ఫోకస్ పడింది. ఇప్పటికే అక్కడ రాజకీయ పార్టీలు.. నేతలు కూడా ఎన్నికలకు సమయాత్తం అవుతున్నారు. అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఈ మేరకు ఆయా చోట్లలో నాయతక్వం మార్పులు చేస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ దొరకుతుంది? ఎవరికి లభించదు? అనే దానిపై సోషల్ మీడియాతో పాటు .. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ మేరకు మంత్రి రోజాకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై మంత్రి రోజా స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదనే ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా ముందు వరుసలో ఉండేది తానే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేశారు. తాను జగనన్న సైనికురాలినరి అని.. ఆయన మాటే తనరకు శిరోధార్యమని అన్నారు. జగన్‌ను ఎదుర్కోలేకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారని విమర్శించారు. పవన్, చంద్రబాబుకి ఎక్కడ పోటీ చేయాలో కూడా తెలియడం లేదు అన్నారు. అందుకే రెండేసి చోట్ల సర్వే చేయించుకుని గెలిచే చోటే పోటీ చేయాలని చూస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు.
అయితే.. మరోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ అవ్వాలని తిరుమల వేంకటేశ్వరుడిని కోరుకున్నట్లు మంత్రి రోజా తెలిపారు. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. తనకు సీటు ఇవ్వకపోయినా తాను సీఎం జగన్ వెంటే ఉంటానని మంత్రి రోజా మరోసారి స్పష్టం చేశారు.