కాంగ్రెస్‌కు ప్రధాని పదవిపై ఆశలేదు: ఖర్గే సంచనల కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 July 2023 3:36 PM ISTకాంగ్రెస్‌కు ప్రధాని పదవిపై ఆశలేదు: ఖర్గే సంచనల కామెంట్స్
కర్ణాటలోని బెంగళూరులో ప్రతిపక్ష నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవిపై ఆసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్‌కు అధికారంపైన గానీ, ప్రధానమంత్రి పదవిపైనా ఆసక్తి లేదన్నారు. సమావేశం ముఖ్య ఉద్దేశం అధికారం దక్కించుకోవడం కాదనీ, రాజ్యంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడమే అని చెప్పారు మల్లికార్జున ఖర్గే.
యూపీఏ కూటమిలో 26 పార్టీలు ఉన్నాయని, మొత్తం 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని అన్నారు. అయితే.. బీజేపీకి సొంతంగా 303 సీట్లు రాలేదన్నారు. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకుంది కానీ.. వారికి అన్యాయం చేసిందని బీజేపీని విమర్శించారు మల్లికార్జున ఖర్గే. తమ మధ్య కొన్ని విభేదాలు ఉన్నా.. అవి సిద్ధాంత పరమైనవి కాదని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడాలని విపక్షాల భేటీలో మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. మోదీ హయాంలో అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని.. వారి హక్కులను కాలరాస్తున్నారని ఖర్గే వ్యాఖ్యానించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ సందర్భంగా ఖర్గే పిలుపు నిచ్చారు.
కర్ణాటకలోని బెంగళూరులో రెండ్రోజుల పాటు ప్రతిపక్షాల పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రెండో రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనేదానిపై వ్యూహాలు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. విపక్షాల భేటీపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. స్వప్రయోజనాల కోసమే కొందరు ఏకం అవుతున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. కాంగ్రెస్‌కు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.