ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై స్పందించిన కిషన్‌రెడ్డి
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసే అంశంపై బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 11:30 AM GMTఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై స్పందించిన కిషన్‌రెడ్డి
తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఈసారైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్దులే లేరని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. వాటిని తిప్పికొట్టేందుకు కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. పార్టీకి అదనపు బలంతో పాటు సస్పెన్ష్ విధించిన వారిని అక్కున చేర్చుకునేందుకు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇదే విషయంపై మాట్లాడారు.
బీజేపీ నుంచి పోటీ చేసి గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచాడు రాజాసింగ్, అయితే.. పార్టీ నుంచి సస్పెండ్ అయి చాలా కాలం అవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారనే చర్చ జరుగుతోంది. రాజాసింగ్ కూడా తాను బీజేపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని లేదంటే ఎన్నికలకు దూరంగానే ఉంటానని చెప్పారు. ఇక తాజాగా రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేతపై స్పందించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హతవేటు తమ అంతర్గత వ్యవహారం అని చెప్పారు. రాజాసింగ్ పోటీలో ఉంటారని హింట్ ఇచ్చారు. బిజెపి జాబితా సిద్దం కాగానే ఆయన సస్పెన్షన్ విషయం చెబుతామని స్పష్టం చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అంతకంటే బలంగా రాజాసింగ్ సైతం తాను పోటీలో ఉన్నానన్నారు. బీజేపీ తొలి జాబితాలోనే తన పేరు ఉంటుందని తెలంగాణలో డబుల్ ఇంజిన్ రావడం సర్కారు ఖాయమని చెప్పడంతో పాటు మరో కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మజ్లీస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే.. తాజాగా ఎన్నికలు దగ్గరపడటంతో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేతపై బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీటీమ్ బీఆర్ఎస్ అని.. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు ఎందుకు తొక్కి పెట్టారంటూ క్వశ్చన్ చేశారు. ఎవరు ఎవరిని కాపాడుతున్నారో రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలన్నారు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మధ్యవర్తిగా మజ్లీస్ ఉందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.