టీడీపీ అభిమానులపై దౌర్జన్యం.. చొక్కాలు, జెండాలు తీయించి..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 10:32 AM ISTటీడీపీ అభిమానులపై దౌర్జన్యం.. చొక్కాలు, జెండాలు తీయించి..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలు, ర్యాలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి మద్దతుగా సైకిల్ యాత్ర చేపట్టిన పలువురు టీడీపీ అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. వారిని దారిలో ఆపిన ఒక వ్యక్తి దుర్భాషలాడుతూ పసుపు చొక్కాలు, టీడీపీ జెండాలు తీయించాడు. అతడు అలా దుర్భాషలడుతూ తిడుతుండగా కావాలని మరీ వీడియో తీయించుకున్నాడు. దాంతో.. ఈ సంఘటనపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరససిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టారు పలువురు టీడీపీ కార్యకర్తలు. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఈ టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులు. వారిని అడ్డుకుని అసభ్యంగా దూషించారు. వారు ధరించిన పసుపు చొక్కాలు విప్పించి, టీడీపీ జెండాలు, కండువాలు తీసేయించాకే పుంగనూరు నుంచి కదలనిచ్చారు. ఇది పెద్దిరెడ్డి నియోజకవర్గం అంటూ.. ఇక్కడ టీడీపీ జెండా ఎగరొద్దంటూ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కొట్టకుండా పంపిస్తున్నాం... సంతోషించండి అంటూ భయపెట్టారు. ఈ తతంగమంతా వీడియో తీయాలని పక్కనున్న వ్యక్తులకు చెప్పిన వైకాపా కార్యకర్త.. చివర్లో తన పేరు చెంగలాపురం సూరిగా చెప్పుకొచ్చాడు.
ఈ సంఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనలో సైకిల్ తొక్కినా నేరమే అయ్యిందని అన్నారు. పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని నారా లోకేశ్ అన్నారు. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుండి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల పై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని నారా లోకేశ్ అన్నారు. ప్రజలకు జగన్‌కు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి.. జెండాలు పీకడానికేనా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.
సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుండి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి… pic.twitter.com/MKLL0bcGdb
— Lokesh Nara (@naralokesh) October 21, 2023