తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ పక్కా: బీజేపీ నేత బీఎల్ సంతోష్

తెలంగాణలో హంగ్‌ ఏర్పడనుందని బీజేపీ సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌ అన్నారు.

By Srikanth Gundamalla  Published on  7 Oct 2023 9:33 AM IST
BJP Leader, BL Santhosh,  telangana elections, hung,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్‌ పక్కా: బీజేపీ నేత బీఎల్ సంతోష్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కొద్దిరోజుల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ కూడా దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడున్న కొద్ది గెలుపు తమదంటే తమదని ఆయా పార్టీలు చెబుతున్నాయి. బీజేపీ సీనియర్‌ నేత బీఎల్ సంతోష్‌ మాత్రం భిన్నంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణలో కచ్చితంగా హంగ్ ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే.. ఏది ఏమైనా తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో పలు కీలక కామెంట్స్ చేశారు బీఎల్ సంతోష్. బీజేపీ నుంచి టికెట్‌ కావాలనుకునే అభ్యర్థులకు సూచనలు చేశారు. టికెట్లు ఢిల్లీలో ఇవ్వరని.. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు నిత్యం ప్రజల్లో ఉండాలని అన్నారు బీఎల్ సంతోష్. అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపు ఢిల్లీలో జరగదని.. తెలంగాణలోనే జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ముక్కోణపు పోటీ ఉన్న నేపథ్యంలో.. హంగ్‌ ఏర్పడనుందని కీలక కామెంట్స్ చేశారు. దాంతో.. బీఆర్ఎస్‌ నేత బీఎల్ సంతోష్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని చెప్పారు. తద్వారా మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రపంచ మంతా భారత్‌ వైపు చూస్తోందని జేపీ నడ్డా అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలను విస్మరించారని జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ బలపడుతోందని జేపీ నడ్డా ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ లో బీజేపీ గెలవాలి... మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని అందుకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని నడ్డా పార్టీ కార్యకర్తలను కోరారు.

Next Story