వరుసగా నాలుగోసారి.. మొత్తం ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం

Bihar CM Nitish kumar.. బీహార్‌ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌

By సుభాష్  Published on  16 Nov 2020 1:56 PM GMT
వరుసగా నాలుగోసారి.. మొత్తం ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం

బీహార్‌ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి ఎరుగని నితీష్‌ కుమార్‌ సారధ్యంతో ఎన్డీయేకే పగ్గాలు కట్టబెట్టారు ప్రజలు. వరుసగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, 20 ఏళ్లలో ఏడు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దేశ రాజకీయాల్లోనే అరుదైన రికార్డు సృష్టించిన నితీష్‌ కుమర్‌ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

నితీష్‌ కుమార్‌ జననం

నితీష్ 1951 మార్చి 1న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పరమేశ్వరిదేవి, కవిరాజ్‌ రామ్‌లఖన్‌సింగ్‌. వారు బీసీ (కుర్మి) సామాజిక వరర్గానికి చెందిన వారరు. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడంతో ఆయన నుంచి నితీష్‌ నైతిక విలువలను ఒంటబట్టించుకున్నాడు. 1973 ఫిబ్రవరి 22న మంజుకుమారిని వివాహం చేసుకున్నారు. ఆమె ఉపాధ్యాయురాలు. వారిద్దరికి ఏకైక సంతానం నిశాంత్ కుమార్. కాగా, నితీష్‌ కుమార్‌ సతీమణి మంజుకుమారి 2007లో అనారోగ్యంతో మరణించారు.

నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం

నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభం గల నితీష్‌ కుమార్‌... కేంద్ర మంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా ఇన్నాళ్ల పాటు ప్రజా జీవితంలో ఉన్నా అవినీతి మరకలు ఏ మాత్రం అంటించుకోని నేతగా ఎదిగారు. రాజకీయాల్లో నితీష్‌ కుమార్‌కు వేలెత్తి చూపించే ధైర్యం ఎవరికి లేనటువంటి నిజాయితీ ఆయన సొంతం. నమ్మిన విలువలు పాటించడంతో ఆయనకున్న అలవాటు. రాజకీయ వ్యూహాలను అమలు చేసి ప్రత్యర్థులను చిత్తు చేయడంలోనూ దిట్ట.

20 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి మరకలేని నాయకుడు

గత 20 ఏళ్ల పాలనలో నితీష్‌ కుమార్‌పై ఒక్క అవినీతి ఆరోపణలు రాకపోవడం విశేషం. 1999లో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో 300 మంది చనిపోతే అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకొన్నారు. బీజేపీతో దాదాపు 20 ఏళ్ల బంధాన్ని సైద్దాంతిక కారణాలతో వదులుకున్నా.. ఆ తర్వాత ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితుల ప్రభావంతో మహాకూటమి వీడి మళ్లీ ఏన్డీయేతోనే చేతులు కలిపి బీహార్‌ను అభివృద్ది పథం వైపు నడిపించడంలో ఎంతో కృషిచేసి ప్రజల మెప్పు పొందారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించనని చెప్పిన ఆయన.. తన ఒక్కగానొక్క కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురాకపోవడం కూడా ఆయనలోని మరో విశేషం అనే చెప్పాలి.

ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి..

నితీష్‌ కుమార్ జీవితంలో 45 ఏళ్ల కిందట విద్యార్ధి సంఘాలతో మొదలైంది. నాటి ప్రముఖ నేత జయప్రకాశ్‌ నారాయణ్ ప్రారంభించిన దేశ వ్యాప్త ఉద్యమంలో నితీష్‌కుమార్‌ చురుకైన పాత్ర పోషించారు. జేపీ, రాం మనోహర్‌ లోహియా, ఎస్‌ఎస్‌ సిన్హా , కర్పూరి ఠాకూర్‌ వంటి దిగ్గజాల నుంచి రాజకీయాలు నేర్చుకున్నారు. నితీష్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లోనూ పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర విద్యుత్‌ బోర్డులో కొంత కాలం పాటు ఉద్యోగం చేశారు. కానీ రాజకీయాల పట్ల ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి రాజకకీయాల్లోకి ప్రవేశించారు. ముందు రెండు సార్లు ఓటమి చవిచూసినా నిరాశ పడకుండా వెనుకడుగు వేయలేదు. 1985లో జరిగిన ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టారు.

వరుసగా విజయాలతో..

1989లో తొలిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1991, 96,98,99,2004లలో సాధారణ ఎన్నికల్లో వరుస విజయాలతో లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహించారు. 1989-99లో వాజ్‌పేయీ ప్రధానిగా బీజేపీ నేతృత్వంలో ఏర్పాటైన సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.1999లో బెంగాల్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2001-04లో మళ్లీ వాజ్‌పేయీ నేతృత్వంలో నితీష్‌ రైల్వే మంత్రిగా పని చేశారు. ఇంటర్నెట్‌ ద్వారా రైల్వే టికెట్ల బుకింగ్‌, తాత్కాల్‌ సేవలు, పెద్ద సంఖ్యలో రైల్వే బుకింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి వి నితీష్ ప్రవేశపెట్టారు. అలాగే 2002లో గుజరాత్‌లో గోద్రా రైలు ఘటన, అనంతరం హింసాకాండ నితీష్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగినవే.

2000 మార్చి నెలలో వారం రోజుల పాటు నితీష్‌ సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2005లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి మూడోసారి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన సీఎం పదవీకి రాజీనామా చేసి ఆ పదవిలో దళిత నేత జితన్‌రాం మాంఝీ ను నియమిచారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జితన్‌రాం నేతృత్వంలో గెలిచే అవకాశం లేదని భావించిన ఆయనను పదవి నుంచి తప్పుకోవాలని కోరగా, అందుకకు ఆయన నిరాకరించారు. దీంతో మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించి నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో చేతులు కలిపి మహాకూటమిగా ఏర్పడి బీజేపీపై విజయం సాధించారు. అప్పుడు కూడాఆర్జేడీ కన్నా జేడీయూకి తక్కువ స్థానాలే లభించినప్పటికీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నితీష్ కే సీఎం పగ్గాలు అప్పగించారు. 2017లో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పై ఆరోపణల నేపథ్యంలో మహాకూటమి సర్కార్‌లో చీలిక ఏర్పడింది. తేజస్వీని రాజీనామా కోరగా, అందుకు ఆయన నిరాకరించడంతో తన సీఎం పదవికి నితీష్‌ రాజీనామా చేశారు. అనంతరం బీజేపీ మద్దతు తీసుకొని అదే నెలలో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story