ఇవాళ కాకపోతే రేపు ఇండియా ప్రభుత్వం సాధ్యం అవ్వొచ్చు: మమతా బెనర్జీ
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 Jun 2024 3:15 PM GMTఇవాళ కాకపోతే రేపు ఇండియా ప్రభుత్వం సాధ్యం అవ్వొచ్చు: మమతా బెనర్జీ
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం మనుగడపై సందేహాన్ని వ్యక్తం చేశారు.ప్రజలు మార్పు కోరుకున్నప్పటికీ బీజేపీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందిన కామెంట్ చేశారు. కాగా.. కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. లోక్‌సభలో పార్టీ అనుసరించే వ్యూహంపై చర్చించారు. ఈ సందర్బంగా ఎన్డీఏ ప్రభుత్వం మనుగడపై సందేహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. మున్ముందు ఏ జరుగుతుందో తాము ఎదురు చూస్తామని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
దేశానికి మార్పు అవసరమనీ.. ఇప్పుడు ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని మమతా బెనర్జీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తీర్పు ఈ మార్పు కోసమే అన్నారు. అందుకే బీజేపీకి సీట్లు తగ్గాయనీ.. భవిష్యత్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలతో అయినా మోదీపై వ్యతిరేకత ఉందని గ్రహించాలనీ.. మోదీ కాకుండా మరొకరు ప్రధానిగా బాధ్యతలు తీసుకోవాలని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
మరోవైపు బీజేపీ కేంద్రంలో అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోందని మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. అందుకే తాము కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సానికి హాజరు కాబోవడం లేదని అన్నారు. ఇవాళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడకపోవచ్చు కానీ.. రేపు అది సాధ్యం కావొచ్చంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీని కోసం అందరం వేచి ఉందామని అన్నారు.