వివేకా హత్యతో రాష్ట్రంలో రాజకీయ దుమారం

By రాణి
Published on : 29 Jan 2020 5:08 PM IST

వివేకా హత్యతో రాష్ట్రంలో రాజకీయ దుమారం

ముఖ్యాంశాలు

    • అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేకా హత్య
    • తర్వాత భారీ మెజారిటీతో వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం
    • విచారణలో సైంటిఫిక్ మెథడ్స్ ని ఫాలో అయిన కొత్త సిట్
    • ప్రధాన నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు
    • అయినా కేసు విచారణలో కనిపించని పురోగతి
    • సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో రిట్ వేసిన వివేకా తనయ

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల రణరంగం ముందున్నవేళ పులివెందులలో వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య జరిగింది. అది కూడా అత్యంత నాటకీయ ఫక్కీలో. ఇంట్లో నిద్రపోతున్న వై.ఎస్.వివేకా దారుణమైన హత్యకు గురయ్యారని అందరూ గుర్తించారు. కానీ మొదట కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆయన చనిపోయారన్న సమాచారం మాత్రం బయటికి వచ్చింది. ఎన్నికలవేళ జరిగిన ఈ దారుణాన్ని గురించి తెలుసుకుని రాష్ట్రంమొత్తం విస్తుపోయింది. టీవీల్లో వివేకా హత్యవార్తను చూసిన ప్రజానీకం షాక్ కి గురయ్యింది. వివేకా సత్సీలత, విలువలు, అందరినీ కలుపుకుపోయేతత్త్వం లాంటి మంచి లక్షణాలను గురించి తెలిసినవాళ్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వివేకాకు అసలు శత్రువులే లేరని, ఆయన అజాత శత్రువనీ భావించేవాళ్లందరి హృదయాల్నీ ఆయన్ని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి పరారైన తీరు కలచివేసింది.

ప్రభుత్వం, ప్రతిపక్షాలు తీవ్రస్థాయి ఆరోపణలు

వై.ఎస్.ఆర్.సి.పికి చెందిన అత్యంత కీలకమైన, సీనియర్ నేత, నాటి ప్రతిపక్షనేత అయిన వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి అయిన వై.ఎస్.వివేకా హత్యపై రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆరోపణల పర్వాలు మొదలయ్యాయి. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్లు చేసిన కుట్రేనని, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, కడప జిల్లాకే చెందిన తెలుగుదేశం మంత్రి ఆది నారాయణరెడ్డిలకు ఖచ్చితంగా వివేకా హత్య కుట్రలో పాత్ర ఉందని వై.ఎస్.ఆర్.సి.పి వర్గాలు ఆరోపించాయి. నాటి తెదేపా మంత్రి ఆదినారాయణ రెడ్డి వై.ఎస్.ఆర్.సి.పి నుంచి తెలుగుదేశం పార్టీకి వలసవెళ్లి మంత్రి పదవిని పొందారు. ఆయనకు పూర్తిగా పులివెందుల రాజకీయాల గురించి కూలంకషంగా తెలుసు. ఉద్దేశపూర్వకంగానే నారాయణరెడ్డిని వై.ఎస్.ఆర్.సి.పి నుంచి తీసుకెళ్లి, మంత్రి పదవి ఆశచూపించి తమను, తమ పార్టీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న వై.ఎస్.ఆర్.సి.పి వర్గాలకు వివేకా హత్య హఠాత్ పరిణామం.

ఖచ్చితంగా ఆది నారాయణ రెడ్డి చంద్రబాబు, లోకేష్ లతో కలిసి వివేకా హత్యకు కుట్రపన్నారనీ, అతి దారుణంగా హత్య చేయించారనీ నేరుగా నాటి ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని లేకపోతే నిజాలు బయటికి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదనీ ఆరోపిస్తూ, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేరుగా గవర్నర్ ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వై.ఎస్. వివేకా హత్యతో పూర్తిగా వై.ఎస్.కుటుంబానికే సంబంధం ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వై.ఎస్.ఆర్.సి.పి అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనీ ఆరోపిస్తూ వివేకా హత్యపై వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ని ఏర్పాటు చేశారు.

అసలు వై.ఎస్.కుటుంబానికి వివేకా హత్యతో సంబంధం లేకపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ ఎందుకు డిస్బర్బ్ చేశారంటూ నాటి ప్రభుత్వాధినేత, ఆయన తనయుడు నాటి మంత్రి లోకేష్, మరో మంత్రి నారాయణరెడ్డి తారాస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొదట కార్డియాక్ అరెస్ట్ అని చెప్పడం, తర్వాత బాత్రూమ్ లో నెత్తుటి మడుగులో మృతదేహం పడి ఉందని చెప్పడం, వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ లో నెత్తుటి మడుగును, మరకల్నీ శుభ్రం చేసేయడం, వివేకా మృతదేహం మీద ఉన్న గాయాలను శుభ్రం చేసి ఆధారాలు లేకుండా చేయడం లాంటి చర్యలన్నీ వై.ఎస్. కుటుంబానికీ వివేకా హత్యకూ సంబంధం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయంటూ నాటి ప్రభుత్వం దుమ్మెత్తిపోసింది.

సిట్ వల్ల ఉపయోగం లేదు

పోస్ట్ మార్టం జరిగిన తర్వాత గానీ అసలు వివేకానంద రెడ్డి మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్న విషయం బయటికి రాలేదు. మొదట మార్క్ 15వ తేదీన అంటే హత్య జరిగిన రోజున “ఉదయం 9 గంటల ప్రాంతంలో క్రైమ్ నెంబర్. 84/2019 కింద కేసు రిజిస్టర్ అయ్యింది. సెక్షన్ 174 సి.ఆర్.పి.సి ప్రకారం మరణానికి కారణం తెలీదని కేసు రిజిస్టర్ లో రాసి ఉంది. పోస్ట్ మార్టమ్ పూర్తైన తర్వాత సి.ఆర్.పి 302 కింది సెక్షన్ మార్చడం జరిగింది” అంటూ వివేకా తనయ డాక్టర్ సునీత తను హైకోర్టుకు దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. సిట్ ఏర్పాటు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదనీ, అధికారులు ప్రభుత్వం ఒత్తిడికి లోబడి ప్రభుత్వానికి కావాల్సిన విధంగా విచారణ జరిపి, నివేదిక ఇస్తారనీ ఆరోపిస్తూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సి.బి.ఐ విచారణకోసం పట్టుబట్టారు. ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలను తారుమారు చేసి కేసును, విచారణను నీరుగార్చేందుకే ప్రభుత్వం సిట్ ని ఏర్పాటుచేసిందని వై.ఎస్. జగన్ తీవ్రస్థాయిలో నాటి ప్రభుత్వం మీద ఆలోపణలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యాయి. భారీ మెజారిటీతో వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

సిట్ లోని సభ్యుల్ని మార్చేసి కొత్త సిట్ ఏర్పాటు

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 14 రోజులకే 13.06.2019న సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ని మార్చేసి కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు. కొత్త సిట్ లో ఇద్దరు డిఎస్పీలు, ఏడుగురు పోలీస్ ఇన్ స్పెక్టర్లు, ఎనిమిదిమంది సబ్ ఇన్ స్పెక్టర్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. కొత్తగా అపాయింట్ చేసిన వాళ్లకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లోని సభ్యులు వెంటనే చార్జ్ ని అప్పగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కడప ఎస్పీకి చార్జ్ హ్యాండోవర్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సిట్ కు కడప ఎస్పీ నేతృత్వం వహించాలన్న నిర్ణయం జరిగింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ అమిత్ గార్గ్, ఐపిఎస్ ను సిట్ నుంచి తప్పించింది కొత్త ప్రభుత్వం. అప్పుడు కడప జిల్లాకు ఎస్పీగా ఉన్న అభిషేక్ మొహంతి ఐపిఎస్ కొత్త సిట్ కు నేతృత్వం వహించారు. కొత్త సిట్ కేసు విచారణలో సైంటిఫిక్ మెథడ్స్ ని అవలంబించింది.

కొత్త సిట్ ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్ర గంగిరెడ్డికి, డి.రంగన్నకు, పి.చంద్రశేఖర్ రెడ్డికి పోలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్, నార్కో అనాలసిస్ టెస్టులు నిర్వహించిందనీ, గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఉన్న సివిల్ హాస్పిటల్ అధికారులు కొమ్మ పరమేశ్వర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్టులు చేయలేదనీ డాక్టర్ సునీత హైకోర్ట్ కి సమర్పించిన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు.

2-9-2019న ఈ కేసులో మరో ప్రధాన అనుమానితుడైన ఎమ్.పరమేశ్వర్ రెడ్డి బావమరిది కె.శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడనీ, ఆత్మహత్యకు ముందు అతను ముఖ్యమంత్రికి, కడప ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డికీ లేఖలు రాశాడనీ, తన ఆత్మహత్యకు కారణాల్ని వివరిస్తూ ఓ వీడియోని కూడా అతని భార్యకు పంపించాడనీ, ఆ వీడినియోని, ఆ లేఖల్నీ ఆత్మహత్యకు సంబంధించిన కేసు నమోదు చేసిన సింహాద్రిపురం పోలీసులు స్వాధీనం చేసుకుని ఉండొచ్చనీ పేర్కొంటూ డా.సునీత తను వేసిన రిట్ పిటిషన్ లో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

శ్రీనివాస్ రెడ్డి శరీరంపై గాయాలున్నాయి

ఆత్మహత్యకు పాల్పడిన కె.శ్రీనివాస్ రెడ్డి రాశాడని చెబుతున్న లేఖలు, అతను తన భార్యకు పంపాడని చెబుతున్న వీడియో సోషల్ మాధ్యమాల్లో విస్తృత స్థాయిలో ప్రచారమయ్యాయని డా.సునీత రిట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. వివేకానందరెడ్డికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆటాప్సీ ..పోస్టుమార్టం పూర్తైన తర్వాత వివేకా శరీరంపై ఉన్న గాయాలను బట్టి పదునైన ఆయుధంతో ఆ గాయాలు చేశారని తన రిపోర్ట్ లో రాసిన విషయాన్ని డా.సునీత రిట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. కొత్త సిట్ ఏర్పాటైన తర్వాత కూడా వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో పురోగతి పెద్దగా కనిపించలేదనీ, నిజానికి తమ కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ అతి వేగంగా జరగాలి కానీ విచారణలో పురోగతి కనిపించకపోవడం అత్యంత దురదృష్టకరమైన విషయమనీ వివేకా తనయ డా.సునీత ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఆమె ఇప్పుడు వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనమయ్యింది.

ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఈ అంశాన్ని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి ఆయుధంగా మలచుకుంటే మరింత రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. లేదూ జరిగేది జరగకమానదు అన్న నిర్లిప్త ధోరణిలో ప్రతిపక్షం ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది మరికొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా.

Next Story