తెలంగాణ: రూ.14 కోట్లతో పోలీస్ స్టేషన్.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
By సుభాష్ Published on 15 Jun 2020 10:43 AM ISTజిల్లా కేంద్రం కాదు.. అలా అని మున్సిపాలిటీ కూడా కాదు. గ్రామ పంచాయితీ మాత్రమే. అలాంటి ఊళ్లో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ కోసం రూ.14కోట్లు ఖర్చు పెడుతున్న వైనం తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సింది. ఒక గ్రామ పంచాయితీలో నిర్మిస్తున్న ఈ పోలీస్ స్టేషన్ కోసం ఎందుకింత ఖర్చు చేస్తున్నారన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ తరహా సంచలన నిర్ణయాలు తీసుకునే దమ్ము.. ధైర్యమే కాదు.. అందరూ ఓకే అనేలా సమర్థించుకునే సత్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతంగా చెప్పాలి.
ఈ పోలీస్ స్టేషన్ హంగు.. ఆర్భాటం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. రెండు అంతస్తులు.. 9వేల చదరపు అడుగులు విస్తీర్ణం.. సిబ్బంది కోసం క్వార్టర్లు.. డార్మిటరీ హాల్.. జిమ్.. అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ పోలీస్ స్టేషన్ కోసం ఏకంగా ఎనిమిది ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఖరీదైన పోలీస్ స్టేషన్ ఎక్కడంటారా? అక్కడికే వస్తున్నాం. సీఎం కేసీఆర్ సొంత మండలమైన సిద్ధిపేట జిల్లా మర్కుక్ లో దీన్ని నిర్మిస్తున్నారు.
పోలీస్ స్టేషన్ తో పాటు.. ఎస్సై.. కానిస్టేబుళ్లకు క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అంతేకాదు.. ఏక కాలంలో వందమంది భోజనం చేసే డార్మిటరీ హాల్ ను నిర్మిస్తున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఖరీదైన పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడకే రూ.కోటి ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకింత ఖర్చు? అన్నప్రశ్నకు సారు విజన్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు అధికారులు.
హైదరాబాద్ మహానగరానికి సమీపంలో నిర్మించిన కొండ పోచమ్మ రిజర్వాయర్ భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని.. ఆ సమయంలో మరింత సిబ్బంది అవసరం కావటం ఖాయమంటున్నారు. ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఇంత భారీగా పోలీస్ స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. భారీ నిర్మాణాలకు తెర తీయాలంటే కేసీఆర్ తర్వాతే ఎవరైనా!