పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అదుపులో ఐదుగురు
By సుభాష్ Published on 8 April 2020 9:47 PM IST
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక దేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో జనాలు బయటకు రాకుండా తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఇదే అదనుగా చేసుకుని కొందరు వ్యక్తులు పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా చిక్కారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెంలోని సలాం సెంటర్ వద్ద ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా కొందరు పేకాట స్థావరాన్ని ఏర్పర్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో రూ. 16,400 నగదుతో పాటు ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒక వైపు కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంటే పేదలు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పేకాటరాయుళ్లు మాత్రం యథేచ్ఛగా పేకాట ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ పేకాట ఆడటంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పేకాట ఆడటం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇలాంటి పేకాట స్థావరాలు కొనసాగకుండా పోలీసులు దాడులు చేయాలని పలువురు కోరుతున్నారు.