హైదరాబాద్‌: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో బీఎన్‌ రెడ్డి నగర్‌లోని అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించగా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అశ్వత్థామరెడ్డిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరవధిక నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

అశ్వత్థామరెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు. ఆహారం తీసుకోకుంటే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. వైద్యుల సూచనల ప్రకారం దీక్షను విరమింప చేసేలా కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను దీక్ష విరమించనని, వైద్యులు అలానే చెబుతారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అశ్వత్థామరెడ్డిని అరెస్ట్‌ చేసే క్రమంలో అసభ్య పదజాలంతో మాట్లాడిన మరో ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.