హైదరాబాద్‌లో మరో కలకలం.. కానిస్టేబుల్‌కు స్వైన్‌ఫ్లూ

By Newsmeter.Network  Published on  3 March 2020 2:22 PM GMT
హైదరాబాద్‌లో మరో కలకలం.. కానిస్టేబుల్‌కు స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్‌లో కరోనా తొలి కేసు నమోదుకావడంతో నగర వాసులు ఇప్పటికే భయాందోళనకు గురవుతుండగా.. తాజాగా స్వైన్‌ ప్లూ కలకలం రేపుతోంది. పోలీసు కానిస్టేబుళ్లు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారనే వార్త ఆందోళనకు గురి చేసింది. పాత బస్తీలోని పేట్ల బురుజు 9 మంది కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్‌లకు తరలించి పరీక్షలు నిర్వహించగా..ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. దాంతో అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 8 మందిని డిశ్చార్జి చేశారు. స్వైన్ ఫ్లూ సోకిన కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో రెండు రోజుల్లో అతడిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు నగరంలో 150కి పైగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. జనవరి నెలలోనే 43 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.

స్వైన్ ఫ్లూ అనేది హెచ్1ఎన్1 అనే వైరస్ మూలంగా వస్తుంది. స్వైన్ ఫ్లూలోనూ సాధారణ ఫ్లూ జ్వరం లక్షణాలే కనిపిస్తాయి.

  • జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి.. స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రధాన లక్షణాలు
  • ముక్కు దిబ్బడ, ముక్కు కారటం కూడా ఉంటాయి.
  • జ్వరానికి తోడు దగ్గు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం ఉంటాయి.
  • కొంత మందికి వాంతులు, విరేచనాలు కూడా కావొచ్చు.
  • మొదట ఇది మామూలు జ్వరం మాదిరిగానే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత లక్షణాలు తీవ్రం అవుతాయి.
  • లక్షణాలు తీవ్రంగా ఉన్నా.. తగు చికిత్స తీసుకోకపోతే న్యుమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.

స్వైన్ ఫ్లూ.. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ రోగులు దగ్గినా, తుమ్మినా వైరస్ గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే ఇతరులకూ సోకుతుంది.

Next Story