చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి డాష్‌ పనులు...

By Newsmeter.Network  Published on  1 Dec 2019 9:27 AM GMT
చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి డాష్‌ పనులు...

చెప్పేవి శ్రీరంగ నీతులు...చేసేవి మాత్రం ఏవో... అన్నట్లుగా మారింది ఈయనగారి పరిస్థితి. వెటర్నరీ వైద్యురాలు అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన పటన్‌ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ పుత్రరత్నం అశీష్‌ గౌడ్‌పై ఇప్పుడు జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉదయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఈయన.. రాత్రి ఓ అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. పగలు నీతులు బోధించిన ఈయన... రాత్రులు మాత్రం ఇటువంటి రాచకార్యాలు వెలగబెడుతున్నాడు. నీతులు పక్కవారికి చెప్పడానికే గానీ... తాము పాటించడానికి కాదన్నట్లుగా ఈ యువ రాజకీయ నాయకుడి వ్యవహార శైలి ఉంది.

శనివారం ఉదయం వైద్యురాలి హత్యపై నిందితులకు ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అశీష్‌ గౌడ్‌. వైద్యురాలి హత్యపై మాట్లాడారు. నిందితులను ఉరి శిక్ష విధించాలి.. లేదా గన్‌ తో కాల్చివేయాలని ర్యాలీలో కోరారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇంత హంగామా చేసిన అశీష్‌ గౌడ్‌...ఆ రోజు రాత్రే హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఓ యువతిపై దురుసుగా ప్రవర్తించడం... అశీష్‌ గౌడ్‌ తీరుపై ఆ యువతి పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడం ఆయన అనుచరులనే షాక్‌కు గురయ్యేలా చేసింది. అంత బాధ్యతాయుతంగా వ్యవహరించిన అశీష్‌... రాత్రి మాత్రం హోటల్‌ లో యువతి చేయి పట్టి లాగడం ఏంటని జనాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఎస్సై ఏమన్నాడంటే...

యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్‌లో ఆ యువతిపై అశీష్‌ ప్రవర్తించిన తీరుపై వివరాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. పబ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటరెడ్డి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ...

బిగ్‌బాస్‌ కంటెస్ట్‌ తనపై చేసిన ఆరోపణలు అబద్ధమని బీజేవైఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆశీష్‌ గౌడ్‌ అన్నారు. 'నేను దోషిగా తేలితే నన్ను పోలీస్‌ స్టేషన్‌ మందు కాల్చండి' అని అన్నారు. తను నా స్నేహితుడు విష్ణు పుట్టినరోజు కావడంతో నోవాటెల్‌ హోటల్‌కి వెళ్లానని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ యువతి తనకు తెలియదన్నారు. నేను పబ్‌లో నా టేబుల్‌ ముందు వారు కూర్చున్నారని.. వారిని పక్కకి వెళ్లమని అడిగానన్నారు. బౌన్సర్లు నాలుగైదు సార్లు చెప్పిన అమ్మాయిలు వినలేదని.. వినకపోగా బౌన్సర్లతో వాదనకు దిగారని పేర్కొన్నారు. ఓ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా నా ముందు టేబుల్‌లో కూర్చున్నాడని అశీష్‌ గౌడ్‌ తెలిపారు.

ఫిర్యాదుదారు తన గురించి తప్పుగా భావించి ఉండవచ్చన్నారు. సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేయమని ఇన్స్‌స్పెక్టర్‌ను అడిగానని అన్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. 'నాపై చేసిన ఆరోపణలు చూస్తుంటే ఎవరో కావాలనే తనపై కక్షగట్టినట్టు తెలుస్తోందని' పేర్కొన్నారు. ఇది రాజకీయ నాటకంలా అనిపిస్తోందని, ప్రస్తుతం తను బీజేవైఎంలో చురుకుగా ఉన్నానని, ధర్మరక్షణ వంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. ఎవరో కావాలనే తనపై దృష్ప్రచారం చేస్తున్నారని అశీష్‌ మండిపడ్డారు.

తప్పుడు ఆరోపణల వల్ల మానసికంగా బాధపడుతున్నానని, తప్పు జరిగితే నేను పోలీస్‌స్టేషన్‌ ముందు చనిపోతాను.. నేను తప్పు చేస్తే బట్టలు తీసి నన్ను కొట్టండి. పబ్‌లో చాలా మంది ఉన్నారు. ఆమె నన్ను తప్పుగా భావించి ఉండవచ్చు. నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడింది. నేను నిన్న పిల్లలతో వెటర్నరీ డాక్టర్‌ హత్య ఘటనపై నిరసన వ్యక్తం చేశాను. నేను రోజంతా శివ దీక్షలో ఉన్నాను. నా స్నేహితుడు తన పుట్టినరోజు పార్టీని నవంబర్‌ నుంచి వాయిదా వేసుకున్నానని అన్నారు.

2012లో మద్యం దుకాణ ఉద్యోగిపై దాడిలో తన ప్రమేయం గురించి చెప్పుకొచ్చారు. 'వారు ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. మద్యం దుకాణం ఉద్యోగి నాతో అసభ్యంగా మాట్లాడాడు. తెలంగాణ ఆందోళన సమయంలో టోల్ ప్లాజా వద్ద జరిగిన సంఘటనపై నాపై కేసు నమోదు చేయబడింది. ఈ కేసులన్నిటి నుండి నేను నిర్దోషిగా ఉన్నాను' అని అన్నారు. బిగ్‌బాస్‌ కంటెస్ట్‌ తనపై చేసిన ఆరోపణల వల్ల తన భార్య బాధపడుతోందని, తన భార్య ప్రస్తుతం గర్భవతి అని అశిష్‌ గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story