మీకు కనిపిస్తున్న ఈ ద్విచక్ర వాహనాలు షోరూంవి అనుకుంటే పొరపాటే. ఇవన్నీ కూడా దొంగిలించిన బండ్లు. దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు. ఇన్ని వాహనాలు ఎలా కొట్టేశారని ఆశ్యర్యపోతున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్లిపోదాం. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మల్లవానితోటకు చెందిన కావడి నానిసింగం, బండి శివ, మరో నలుగురు బృందాలుగా ఏర్పడి కొన్ని నెలలుగా బైక్‌లను చోరీ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు ఆ ద్విచక్ర వాహనాల చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తుండగా, వారు అడ్డంగా దొరికిపోయారు. వారిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. జల్సాలకు అలవాటు పడి ఇలా వాహనాలను చోరీ చేసి డబ్బులను కూడబెట్టుకుంటున్నారు.

ఎక్కడ ఎన్ని వాహనాలు దొంగిలించారంటే..
ఈ పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలు సదరు దొంగలు ఒక్కో ప్రాంతంలో చోరీలకు పాలప్డ్డారు. విశాఖలో 43, తూర్పు గోదావరి జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 22, విజయవాడలో 7, విజయనగరం 2 చొప్పున బైక్‌లను దొంగిలించారు. దీంతో పట్టుబడ్డ వాహనాలను పోలీసులు ఇలా ప్రదర్శనకు ఉంచారు.

అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయని అధికంగా కేసులు నమోదు కావడంతో రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవి. మోహన్‌రావు సూచనల మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ ఆస్మీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్న ఆలమూరు ఎస్సైకు ఒక వాహనం పట్టుబడటంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఇదే ప్రాంతంలో కొందరు కొనుగోలు చేసిన వాహనాలను లెక్కపెడితే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 వాహనాలు పట్టుబడ్డాయి. ఈ కేసును ఛేదించిన ఆలమూరు ఎస్సై శివప్రసాద్‌, మండపేట రూరల్‌ ఎస్సై దొరరాజుతో పాటు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *