ముఖ్యాంశాలు

  • కోల్ కత్తా లో దీదీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన
  • జామై మిలియా విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండిస్తూ ర్యాలీ
  • మమత బెనర్జీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన
  • రాష్ట్రంలో పౌరసత్వ చట్ట సవరణ అమలుపై వ్యతిరేకత
  • పోలీసుల చర్యలపై తీవ్రస్థాయిలో వెల్లువెత్తిన వ్యతిరేకత
  • అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, పౌరుల మద్దతు
  • ఢిల్లీలో ప్రియాంకా వాద్రా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
  • ప్రదర్శనలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలోని కొత్త సవరణలకు వ్యతిరేకంగా జామై మిలియా ఇస్లామీ విశ్వవిద్యాలయం, అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం విద్యార్థులు తలపెట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీయడం, హింస చెలరేగడంపై ఆందోళన వ్యక్తమయ్యింది. విద్యార్థులను అదుపుచేసేందుకు పోలీసులు చర్యకు దిగడంపై దేశంలో అనేక వర్గాలనుంచి, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులనుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.

ఈ నేపధ్యంలో మోడీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ రాష్ట్రంలో అమలుకానివ్వడానికి వీల్లేదంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వేలాదిమంది కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోల్ కతాలో జరిగిన ఈ ర్యాలీని మమత ముందుండి నడిపించారు.
మొత్తం భారత దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన 22 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు, చట్టబద్ధమైన సంఘాలు, సామాన్య పౌరులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివచ్చి విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు.

జామై మిలియా విద్యార్థులు తలపెట్టిన నిరసన ప్రదర్శనలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వవిద్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా నిలిచారు.

ఎముకలు కొరికే చలినికూడా లెక్కచేయకుండా విద్యార్థినీ విద్యార్థులు విశ్వవిద్యాలయం ఎదుట రోడ్లపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఢిల్లీ, చండీఘర్, లక్నో, పాట్నా, గౌహతి, కోల్ కతా, అలీఘర్, వారణాసి, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పాండిచ్చేరీ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

పరీక్షల్ని బహిష్కరించి క్యాంపస్

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన చాలామంది విద్యార్థులు పరీక్షల్ని బహిష్కరించి క్యాంపస్ లో ఉత్తరంవైపు విభాగంలో జామై విద్యార్థులతో కలసి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున పోలీస్ బలగాలను మోహరించింది.

నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికీ, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. కొందరు విద్యార్థులు ఈ నిరసన ప్రదర్శనను ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రత్యక్షప్రసారం చేశారు.

అదుపులోకి తీసుకున్న 50మంది జామై విశ్వవిద్యాలయం విద్యార్థుల్ని విడిచిపెట్టిన తర్వాతకూడా క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితి అలాగే కొనసాగింది. పరిస్థితి తీవ్రతను గమనించిన కొందరు విద్యార్థులు హాస్టల్ ను విడిచిపెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. నిరవధికంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనల కారణంగా విశ్వవిద్యాలయం అధికారులు జనవరి ఐదో తేదీవరకూ సెలవు ప్రకటించి మొత్తం పరీక్షలన్నింటినీ రద్దు చేశారు.

నిరసన ప్రదర్శనలో కొందరు విద్యార్థులు జె.ఎమ్.ఐ విశ్వవిద్యాలయం గేటు బయట అర్థనగ్నప్రదర్శన చేశారు. విద్యార్థుల నినాదాలతో మొత్తం క్యాంపస్ అంతా హోరెత్తింది. పోలీస్ చర్యపై వెంటనే సి.బి.ఐ విచారణకు ఆదేశించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్నందున హాస్టల్ ను ఖాళీ చేసి వెళ్లాల్సి రావడం, పరీక్షలు రద్దుకావడం తమకు చాలా బాధ కలిగించిందని కొందరు విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో విశ్వవిద్యాలయంలో ఉండడం మంచిది కాదన్న ఉద్దేశంతో మరికొందరు విద్యార్థులు సొంతగూటికి చేరుకున్నారు.

టియర్ గ్యాస్- లాఠీచార్జ్ చేసిన పోలీసులు

విద్యార్థుల ఆగ్రహాన్ని అదుపుచేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించి, లాఠీచార్జ్ చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా వివరించిన కొందరు విద్యార్థులు తమ వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.

క్యాంపస్ లో ఉన్న పరిస్థితిని టీవీల్లో కళ్లారా చూసిన తల్లిదండ్రులు భయపడిపోయారు. బస్సుల్ని తగలబెట్టిన ఘటన తర్వాత విద్యార్థులతో పోలీసులు వ్యవహరించిన తీరుని చూసిన కొందరు తల్లిదండ్రులు గొడవలు సద్దుమణిగేవరకూ ఇంటిపట్టునే ఉండమని పట్టుబట్టారు.

విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ నజ్మా అక్తర్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విశ్వవిద్యాలయంలో మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పిలుపుఇచ్చారు. రాజకీయ నేతలు ఎవరైనా సరే క్యాంపస్ లో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో విశ్వవిద్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

క్యాంపస్ లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించారని, పోలీసులు క్యాంపస్ లోనే ఉంటే విద్యార్థులకు నష్టం కలుగుతుందని పలువురు తీవ్ర స్థాయిలో ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం ఆస్తులకు భారీ స్థాయిలో నష్టం కలిగింది.

జాతీయ పౌరసత్వ చట్టంలో చేసిన మార్పుల్ని ఏమాత్రం ఆమోదించేది లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో పలుచోట్ల భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పోలీసులు విద్యార్థులను కనీసం విద్యార్థులుగానైనా గుర్తించడానికి సిద్ధంగా లేరంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

భారీ స్థాయిలో హింస చెలరేగడానికి, విద్యార్థులపై పోలీస్ చర్యకు ప్రధాని నరేంద్రమోడీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఇండియా గేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరిపారు.

త్వరలోనే ఆమె జామై మిలియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ అందుకు అనుమతి లేదని అధికారులు అంటున్నారు.

జె.ఎమ్.ఐ, ఎ.ఎమ్.యు విద్యార్థులకు మద్దతు తెలుపుతూ, వారిపై పోలీస్ చర్యను ఖండిస్తూ ప్రియాంక గాంధీ వాద్రా బైఠాయించడంతో కొంతసేపు ఉద్రిక్తత మరింత పెరిగినట్టయ్యింది. అహ్మద్ పటేల్, కె.సి.వేణుగోపాల్, సుస్మిత దేవ్, జె.డి.టైలర్ ప్రియాంక వాద్రాకు మద్దతుగా నిలిచారు. వీరితోపాటుగా 300మంది కార్మికులు విద్యార్థులపై దాడులను వెంటనే ఆపాలంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

 

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.