కరోనా ఎఫెక్ట్.. హోలీ వేడుకలకు ప్రధాని దూరం..

By Newsmeter.Network  Published on  4 March 2020 8:10 AM GMT
కరోనా ఎఫెక్ట్.. హోలీ వేడుకలకు ప్రధాని దూరం..

కరోనా వైరస్‌ దాదాపు అన్ని దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాను ఈ ఏడాది హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ అరికట్టడానికి సాధ్యమైనంత వరకు ప్రజలు గుంపులుగా ఏర్పడవద్దని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారని వెల్లడించారు. అందుకే ఈ సారి ఎటువంటి హోలీ వేడుకల్లో పాల్గొననని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ నిర్ణయంతో.. దేశ ప్రజలు కూడా హోళీ వేడుకులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోళీ పండుగను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 28 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.



వేడుకలను నిషేదించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌..

ఇదిలా ఉండగా.. హోలీ సంబరాలపై నిషేదం విధించాలంటూ తెలంగాణలోని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌లోని మణికొండకి చెందిన గంపా సిద్దలక్ష్మి హోలీ సంబరాలను నిషేదించాలని హైకోర్టుని ఆశ్రయించారు. హోలీ సంబరాల్లో ఎక్కువ మంది ప్రజలు ఒకే చోట గుమిగూడే అవకాశం ఉందని.. కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఎక్కవగా ఉందన్నారు. ఈ నెల 9 లేదా 10 తేదీల్లో ఈ సంబరాలు జరుగనున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం ద‌ష్ట్యా ఈ వేడుకలని నిషేధించాలని రిట్ పిటిషన్‌లో ఆమె కోరారు. వేడుకలని నిషేధించడం ద్వారా ప్రజలని వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు..

Next Story