సాధారణంగా రైలు ప్రయాణాల్లో భోజనం చేయడం చాలా మందికి ఇష్టం. ఇంటి వద్దే తినే వెళ్లే సమయమున్నా సరే..అదో అనుభూతి..ఎంజాయ్ మెంట్ అనుకోండి. కదులుతున్న రైలులో కిటికీ పక్కన కూర్చుని భోజనం చేస్తూ..ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. కానీ..ఇప్పుడు ట్రైనే భోజనం తీసుకొచ్చి మీకిస్తుంది. ఆశ్చర్యంగా ఉందా..? నిజమేనండి.. ప్లాట్ ఫాం 65 రెస్టారెంట్ లో భోజనాన్ని రైలే తీసుకొచ్చి కస్టమర్లకు అందిస్తుంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కొత్త రెస్టారెంట్ కు భోజన ప్రియులు క్యూ కడుతున్నారు. వారాంతానికి సుమారు 2500 మంది తమ ఫ్యామిలీ, స్నేహితులతో ఇక్కడికి వచ్చి రైలు తెచ్చే భోజనాన్ని చేస్తున్నారు. ఇందులో కేవలం నాన్ వెజ్ మాత్రమే కాకుండా..వెజ్ భోజనాన్ని కూడా అందిస్తున్నారు.

Plot Form 65 Restaurant 3

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వచ్చిన ఒక వినూత్న ఆలోచనే ఈ ప్లాట్ ఫాం 65 రెస్టారెంట్. సర్వేశ్వరరావు, వినోద్, మధు అనే ముగ్గురు వ్యక్తులు టీసీఎస్ లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే స్నేహితులైన ఈ ముగ్గురు అందరినీ ఆకట్టుకునేలా ఏదైనా రెస్టారెంట్ ను ప్రారంభించాలనుకున్నారు. అంతే..పూర్వకాలంలో భోజన పద్ధతుల గురించి అన్వేషించారు. జైపూర్ ప్యాలెస్ లో భారీగా ఉండే రాజు డైనింగ్ టేబుల్ పైన అందరికీ ఆహారాన్ని అందించేందుకు ఒక రైలుండేదని తెలుసుకున్నారు. అలాగే జర్మనీలో భోజనాలందించే బుల్లి రైళ్లను తయారు చేస్తున్నారని తెలుసుకుని..అలాంటి రైళ్లను ముంబైలో ఉన్న జపాన్ సాంకేతిక నిపుణులతో డిజైన్ చేయించారు. సుమారు రూ.2 కోట్లతో కూకట్ పల్లి రోడ్ 65 ఆనుకుని ఉన్న బిల్డింగ్ లో రెస్టారెంట్ ను ప్రారంభించారు. రోడ్ 65 పక్కనే రెస్టారెంట్ ఉండటంతో దీని పేరు ప్లాట్ ఫాం 65గా నామకరణం చేశారు.

Plot Form 65 Restaurant 2

రెస్టారెంట్ లోపల 4 స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ నాలుగు స్టేషన్లను కాచిగూడ, చెన్నై సెంట్రల్, ముంబై వీటీ స్టేషన్, జర్మనీ ఫిన్ ల్యాండ్ స్టేషన్లను తలపించేలా ఇద్దరు ఆర్కిటెక్ లు, ఒక ఆర్టిస్ట్ తో తయారు చేయించారు. నాలుగు స్టేషన్లలో 31 ప్లాట్ ఫాం లు అంటే..31 టేబుళ్లుంటాయి. భోజనాలందించే రైళ్లు వెళ్లేందుకు 787 అడుగుల పొడవైన పట్టాలను ఏర్పాటు చేశారు.

కస్టమర్స్ ఉన్న టేబుల్ వద్దకు కెప్టెన్ వచ్చి ఆర్డర్ తీసుకుని ఫోన్ ద్వారా నమోదు చేయడంతో అది హోటల్ కంప్యూటర్ లోకి వెళ్తుంది. ఏ స్టేషన్ లో కూర్చున్నారు ? ఏ ప్లాట్ ఫాం పై కస్టమర్లున్నారన్న వివరాలను కూడా కెప్టెన్ నమోదు చేస్తాడు. కిచెన్ లో ఉండే చెఫ్స్ తమ వద్ద ఉండే ప్రింటర్ ద్వారా ఆర్డర్ పేపర్ ను తీసుకుని..అందులో ఉన్నదాని ప్రకారం వంటలు చేసి రైలుపై పెట్టి..అక్కడే ఉండే కంట్రోల్ ప్యానల్ బోర్డు ద్వారా ఆహారం చేరవేయాల్సిన స్టేషన్, ప్లాట్ ఫాం లను సూచిస్తారు. రైళ్లకు అమర్చిన ప్రత్యేక సెన్సార్ల సహాయంలో రైలు సరిగ్గా కస్టమర్లున్న ప్లాట్ ఫాం వద్దకెళ్లి ఆగుతుంది. రైలు తీసుకొచ్చిన భోజనాన్ని కస్టమర్లు తీసుకుని భోజనాన్ని ఆస్వాదిస్తారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.