తెలంగాణలో ఆదిమానవుల ఆనవాళ్లు చెప్పే చిత్రాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 1:43 PM GMT
తెలంగాణలో ఆదిమానవుల ఆనవాళ్లు చెప్పే చిత్రాలు..!

రామగిరి ఖిల్లా: చరిత్ర అన్వేషణకు దారి. ఆ అన్వేషనే తెలంగాణలో ఆదిమానవుని ఆనవాళ్లను బయట పెట్టింది. రామగిరి ఖిల్లాకు అన్నిదారులు తెలిసిన చరిత్రకారుడు, గైడ్ సముద్రాల సునీల్ అన్వేషణలో చరిత్ర పూర్వయుగపు ఆధారాలు కొత్తగా వెలుగుచూశాయి.

తెలంగాణా రాష్ట్రంలోని పెద్దపల్లి..రామగిరి ఖిల్లాది ప్రత్యేక చరిత్ర. తెలంగాణా చరిత్రలో రామగిరి ఒక పేజీ తప్పనిసరి. తెలంగాణాలో చరిత్రపూర్వయుగం, తొలి చారిత్రక దశలు, చారిత్రక యుగం చరిత్ర-సంస్కృతులను అధ్యయనం చేయడానికి రామగిరి చరిత్రకారులకు స్వర్గధామం లాంటిది.

రామగిరి ఖిల్లా ఎక్కడం మొదలుపెట్టి మొదటి దర్వాజకు చేరుకోగానే విరిగిన దర్వాజ, మొండి కోట కనిపిస్తాయి. విరిగిన ద్వారానికి కుడి పక్కన క్రీ.శ.1478 నాటి తుమ్మీఖాన్ 10వేల రూకలు ఖర్చుపెట్టి చేయించిన కోట దర్వాజ శాసనం ఉంటుంది. దర్వాజ నుంచి ఎడమ వైపుకు గొల్లభామల దిక్కు పోతే పెండ్లిబావి. బాయి దాటాక 100 మీ.ల దూరంలో చిన్నగుహలో లింగం లేని పానవట్టం. ఈ గుహలోనే ఎరుపురంగులో వేసిన రాతి చిత్రాలు కనిపిస్తాయి.

ఈ రాతిచిత్రాలలో ఒక మనిషి, ఒక ఎద్దు, గుర్తించడానికి వీలుకాని జంతువుల బొమ్మలు రెండు, మరొక మనిషిబొమ్మ కనిపిస్తాయి.

బొద్దు గీతలతో వున్న ఈ రాతిచిత్రాలు శైలిని బట్టి, వస్తువును బట్టి చాల్కోలిథిక్ పీరియడ్ కు చెందినవని చెప్పవచ్చు. కొత్తరాతియుగం నుంచి పెద్దరాతియుగానికి పరిణమించే సమయంలోని మానవసంస్కృతి ప్రతిబింబాలనవచ్చు.

ఈ గుహకు అవతలివైపు గుహలో పదునైన మొన వున్న పరికరంతో గీరి గీసిన గీర బొమ్మలు (పెట్రోగ్లైఫ్స్) వున్నాయి. ఈ బొమ్మలలో ఎడమచేత త్రిశూలం ధరించిన నిలబడ్డ వేటగాడు, పక్కన పెద్దపక్షి కనిపించాయి. ఈ చిత్రాలు రాతిచిత్రాల వేసే కాలానికి పూర్వానివి.

ఠాకూర్ రాజారాం సింగ్ ఇటువంటి పెట్రోగ్లైఫ్స్ ను చూసి, వాటిని మధ్యరాతియుగం చిత్రాలని రాశాడు. వాటిని మనం వివి కృష్ణశాస్త్రి పుస్తకంలో కూడా చూడొచ్చు. పోలికలు చూస్తే... ఈ రామగిరి పెట్రోగ్లైఫ్స్ కూడా మధ్యరాతియుగం నాటి చిత్రాలని చెప్పవచ్చు.

రాజారాం సింగ్‌కు రామగిరి కొండ మీద విశేషమైన సూక్ష్మరాతిపరికరాలు రాశులుగా లభించాయి.

అక్కడికి 10మీ.ల దూరంలోనే పెదరాతియుగానికి చెందిన రాళ్ళకుప్ప సమాధులు 36వున్నాయి. ఇవన్నీ రాతినేలమీదనే రాతికుప్పలతో ఏర్పరచిన సమాధులు. చాలా అరుదైనవి.

వీటిలో మొదటి వరుసలో 6వ సమాధి దాటగానే పడిపోయిన స్తంభం లాంటిది కనిస్తుంది. మిగతాచోట్ల సమాధుల అంచుల్లో రాళ్ళపేర్పుతో నిలిపిన రాతి స్తంభాల వంటి స్తంభాలు ప్రతి సమాధికి కనిపిస్తాయి. కొన్ని సమాధుల్లో ఎముకలు దొరికాయి. ఆ పరిసరాల్లో ఇనుము చిట్టేలు, బండలపై రాతిబొద్దులు(కప్ మార్క్స్), కుండ పెంకులు విరివిగా కనిపిస్తున్నాయి.

వాటిని దాటిపోతే గొల్లభామలు, సూటిగా పోతే నందిముక్కు, దానికి ఎడమవైపు నడిస్తే పాండవలోకం చేరుకుంటాం. అక్కడ రెండు దిగుడు బావులు, ఒక చేదబావి వున్నాయి. ఆ పక్కన నివాసాల శిథిలాలు కనిపిస్తాయి.

రామగిరిఖిల్లా మీద చరిత్రపూర్వయుగ సంస్కృతి ఆనవాళ్ళు వెతికిన కొద్ది లభిస్తాయి. అన్వేషణ కొనసాగిస్తే ఇంకా చారిత్రకాధారాలు తప్పక లభిస్తాయి.

తెలంగాణలో దొరికిన చిత్రాలు ఆదిమానవని జీవనశైలిని..అప్పటి వేట పద్దతులను మనకు తెలిసేలా చేస్తున్నాయి. ఆనాడు వారు ఎలా బతికేవారు..ఆహారపు అలవాట్లు, వేటకు వాళ్లు ఎటువంటి ఆయుధాలు వాడారు అనే దానిపై ఓ అంచనాకు రావచ్చు.

మధ్య పాతి రాతియుగంలోనే రంగులపై అవగాహన: సముద్రాల సునీల్, చరిత్రకారుడు

ఈ చిత్రాలు మధ్యపాతరాతి యుగం నాటి చిత్రాలుగా చరిత్రకారుడు సముద్రాల సునీల్ చెప్పారు. గుహల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గీచిన చిత్రాలు అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జంతువులు, పక్షులతో ఆనాటి నుంచే మనిషి స్నేహంగా ఉన్నాడని చెప్పడానికి ఈ చిత్రాలు నిదర్శనమన్నారు. జాజి అనే దానితో ఈ చిత్రాలు గీచి ఉండొచ్చు అన్నారు. జాజి, చెట్లు వేర్ల రసం, ఆకుల రసంతో ఆనాడు ఈ చిత్రాలు వేశాడంటే..పాత మధ్యరాతి యుగంలోనే మనిషికి రంగుల మీద అవగాహన ఉందన్నాడు. త్రిశూలంలో చేతిలో ఉన్న బొమ్మ మాత్రం వారి ఆయుధం అయి ఉంటుందని చెప్పారు. అయితే.. ఈ త్రిశూలం పట్టుకున్న చిత్రం, పక్కన పెద్ద పక్షి మాత్రం పదునైన రాయితో గీసిందన్నారు. అప్పటికీ దేవుడుకి పూజలు మనుషులు ప్రారంభించలేదన్నారు. భారతదేశంలో చాలా చోట్ల ఇలాంటి చిత్రాలు ఉన్నాయని చెప్పారు. 50వేల ఏళ్ల క్రితమే మానవుడు తెలంగాణలో తిరిగియాడాడు అనడానికి ఈ చిత్రాలు సాక్ష్యాలు అన్నాడు చరిత్రకారుడు సముద్రాల సునీల్.

Next Story