లాక్‌డౌన్: కఠినంగా వ్యవహరిస్తున్న దేశాలు ఇవే..
By అంజి
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అన్ని దేశాలకు కరోనా వైరస్ విస్తరించడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోని దాదాపు 180 దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ప్రజలు సామాజిక దూరం పాటించి కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలని ఆయా దేశాలు తమ ప్రజలకు పిలుపునిచ్చాయి.
అయితే కొన్ని దేశాల్లో ప్రజలు తమకేమి పట్టనట్టుగా, ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు. ఏ మాత్రమూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. రోడ్లపైకి వస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. పోలీసులు ఎంత మొత్తుకున్నా ఫలితం కనబడటం లేదు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని ప్రజలపై ఆయా దేశాలు ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాయి.
సౌతాఫ్రికా దేశంలో రోడ్లపైకి వచ్చిన వారితో పోలీసులు మండుతున్న ఎండలో రోడ్డుపై పోర్లు దండాలు పెట్టించారు. జొహాన్‌స్‌బర్గ్‌లో పోలీసుల వాటర్ క్యానన్లు వినియోగించారు.
మెక్సికో దేశంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. హాంకాంగ్‌లో సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. సింగపూర్‌లో ప్రజలు బయటికి వస్తే అక్కడి ప్రభుత్వం భారీ జరిమానాలను విధిస్తోంది.
తాజాగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.. రోడ్లపైకి వచ్చిన వారిని కాల్చి పారేయాలని ఆర్మీకి ఆదేశాలు ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు పాటించడం లేదన్న కారణంతోనే అధ్యక్షుడు రోడ్రిగో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.