కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ తో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 2 నెలల నుంచి మూతపడి ఉన్న సినిమా థియేటర్లను ఇప్పుడప్పుడే తెరిచే పరిస్థితి లేదన్నట్లు తెలుస్తోంది. దీంతో లాక్ డౌన్ కు ముందు విడుదలకు సిద్ధమైన సినిమాల్లో కొన్ని ఇప్పుడిప్పుడే ఓటీటీని ఆశ్రయిస్తున్నాయి.

ఓటీటీ (Over The Top)..ప్లాట్ ఫాం ఇప్పుడు పెండింగ్ లో ఉండిపోయిన సినిమాల విడుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఓటీటీ పుణ్యమా అని సినిమాగా తీయాలనుకున్న కథను కూడా వెబ్ సిరీస్ రూపంలో విడుదల చేసేస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక నటించిన పొనుమగల్ వాందల్ చిత్రాన్ని ఓటీటీ వేదికగానే రిలీజ్ చేశారు. తాజాగా..ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ వెల్లడించారు. జూన్ 8వ తేదీన చిత్రం టీజర్, 19న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

కాగా..పెంగ్విన్ చిత్రం పోస్టర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్ లో కీర్తి సురేష్ కన్నీటితో గాయాలతో కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే పెంగ్విన్ ఒక పెయిన్ తో కూడిన క్రైమ్ కథా చిత్రంలా కనిపిస్తోంది. అసలు కథేంటో తెలియాలంటే జూన్ 19వ తేదీ వరకూ ఆగాల్సిందే. ఈ సినిమాకు సంతోష్ నాయరణ్ సంగీతం సమకూర్చగా, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా ఉన్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *