రివ్యూ : పెంగ్విన్‌.. మిస్టరీ థ్రిల్లర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2020 5:51 AM GMT
రివ్యూ : పెంగ్విన్‌.. మిస్టరీ థ్రిల్లర్

సినిమా : పెంగ్విన్‌

నటీనటులు : కీర్తి సురేశ్‌, ఆదిదేవ్‌, లింగ, మాస్టర్‌ అద్వైత్‌ తదితరులు

సంగీతం : సంతోష్‌ నారాయణ్

రచన, దర్శకత్వం : ఈశ్వర్‌ కార్తిక్‌

నిర్మాత : కార్తిక్‌ సుబ్బరాజ్‌

విడుదల : అమెజాన్‌ ప్రైమ్‌

లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లు మూతపడడంతో సినిమాలు నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. మహానటి కీర్తి సురేష్‌ నటించిన తాజా చిత్రం 'పెంగ్విన్'‌. తమిళంతో పాటు తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్లే కారణం. ఈ చిత్ర టీజర్‌ను చూస్తే ఓ థిల్లర్‌ సినిమా అనే అర్థం అవుతుంది. మరీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.

కథ : రిథమ్‌(కీర్తి సురేష్‌)కు తన రెండేళ్ల కొడుకు అజయ్‌(మాస్టర్‌ అద్వైత్) అంటే ఎంతో ఇష్టం. తన భర్త రఘు(లింగ), కొడుకుతో కలిసి ఆనందంగా జీవిస్తుంటుంది. అయితే.. ఓ రోజు ఆడుకోవడానికి వెళ్లిన అజయ్‌ను ఎవరో కిడ్నాప్‌ చేస్తారు. ఎంత వెదికినా అజయ్‌ కనపడడు. తన కోసం వెతికి వెతికి అలసిపోతుంది. ఏడాది గడిచినా అతడి కోసం అన్వేషణ ఆపదు. రఘు కూడా విడాకాలు తీసుకుంటాడు. దీంతో రిథమ్‌ ఇంకా కుంగిపోతోంది. అయినా కొడుకు కోసం వెతుకుతూనే ఉంటుంది. తన గురించి అన్ని తెలిసిన గౌతమ్‌(రంగరాజ్‌) అనే వ్యక్తిని రిథమ్‌ పెళ్లి చేసుకుంటుంది. ఈ క్రమంలో గర్భం దాలుస్తుంది. ఓ రోజు అజయ్‌ కనపడుతాడు. అప్పుడు అజయ్‌ ఏ స్థితిలో ఉన్నాడు. అనేళ్ల పాటు అతడు ఏమయ్యాడు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి చార్లీ చాప్లిన్‌ గెటప్‌లో ఎందుకు ఉన్నాడు..? కిడ్నాపర్‌ ఎవరో తెలుసుకోవడానికి రిథమ్‌ ఏం చేసింది..? చివరికి కిడ్నాపర్‌ ను రిథమ్ కనిపెట్టిందా..? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : ఇదొక మిస్టరీ థ్రిల్లర్ సినిమా. కీర్తి సురేష్‌ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించింది. ఆమె నటనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ, తల్లిగా, గర్భిణిగా ఆమె నటన అద్భుతం. పెంగ్విన్‌ సినిమాను మొదలు పెట్టిన సన్నివేశం చూస్తే గగుర్పాటు కలుగుతుంది. ఒక తల్లి పెంగ్విన్ సముద్రంలో చిక్కుకున్న తన పిల్ల పెంగ్విన్ ను కాపాడటం కోసం ఎలా ప్రాణాలకు తెగించి పోరాడుతుందో ఒక కథ రూపంలో తల్లి బిడ్డకు చెప్పడం ద్వారా సినిమాను ముందుకు నడిపిస్తున్న తీరు చూసి దర్శకుడు సింబాలిక్ గా సినిమా కథను చెప్పే ప్రయత్నం చేయడమూ ఆకట్టుకుంటుంది. కిడ్నాప్‌ ఎవరు చేశారన్న పాయింట్‌తో రెండు గంటలను ప్రేక్షకులను కదలకుండా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అజయ్‌ సడెన్‌గా కనిపించడంతో ప్రేక్షకుల్లో అప్పటి వరకు ఉన్న ఉత్కంఠ పోతుంది. అయితే.. వెంటనే అతడిని ఎవరు కిడ్నాప్‌ చేశారు..? ఎందుకు చేశారన్న ప్రశ్నలతో మళ్లీ ప్రేక్షకులను కథలో నిమగ్నం చేశాడు దర్శకుడు. అజయ్‌తో పాటు చాలా మంది పిల్లలను ఎవరు కిడ్నాప్‌ చేశారు అన్నచిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లాడు.

సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే.. సినిమా బడ్జెట్‌కు పరిమితులు ఉన్నప్పటికి, సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా కెమెరామెన్‌ పనితనం కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌ సంగీతం ఫర్వాలేదు. కాగా.. సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీతతగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ ను ఇంకా కొంచెం మంచిగా రాసుకుంటే బాగుండేది. ఒక్క కీర్తి సురేశ్‌ తప్ప మిగిలిన పాత్రల్లో నటించిన వారు ఎవరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవడం ఈ సినిమాకు మెనస్‌. అయితే.. రోటీన్‌ సినిమాలు వద్దకునే వారు చూడాల్సిన సినిమా. ఒక్క క్లైమాక్స్‌ మినహా సినిమా ప్రేక్షకుడికి మంచి అనుభవాన్ని పంచుతుంది.

Next Story