బాదం ఆకులు లేవని..ఇడ్లీలు చల్లారిపోయాయి..
By రాణి Published on 11 Feb 2020 11:34 AM GMTపెళ్లి పుస్తకం.. సామాన్యంగా ఆలుమగల మధ్య జరిగే విషయాలను తీసుకుని దర్శకులు బాపు రమణలు తెరకెక్కించిన దృశ్యకావ్యమిది. బాపు-రమణలు తీసిన ఈ చిత్రం నిజ జీవితానికి అద్దంపట్టేలా ఉంటుంది. అందుకే అప్పటి తరానికే కాదు..ఇప్పుడున్న తరానికి..ముందు రాబోయే తరానికి కూడా ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోని 'శ్రీరస్తు శుభమస్తు' పాట అందరికీ ఆల్ టైం ఫేవరెట్. ఈ పాట విన్నవారెవరికైనా తమ పెళ్లిరోజు గుర్తురాకుండా ఉండదు. దాదాపు ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్లకు కూడా ఈ పాటనే ఎక్కువగా వాడుతుంటారు. రాజేంద్ర ప్రసాద్ - దివ్యవాణి ల మధ్య జరిగిన సన్నివేశాలు, వారి కాపురంలోని కలహాలు, జీవితంలో చిక్కులను ఎలా ఎదుర్కొన్నారనేది సినిమా రూపంలో చూపించినా...నిజ జీవితంలో కూడా ఇలాంటి ఘటనలెన్నో జరుగుతుంటాయి. వాటన్నింటినీ తట్టుకుని సంసారాన్ని ఎలా నడిపించాలన్నదే ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన నీతి.
అసలు ఈ సినిమా టాపిక్ ఎందుకొచ్చిందనేగా మీ అనుమానం. 1991లో బాపు-రమణ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే రమణ రాసుకున్న స్ర్కిప్ట్ లో రాధకుమారి, సాక్షి రంగారావు బాదం ఆకుల విస్తర్లలో ఇడ్లీలు తింటూ మాట్లాడుకుంటున్నట్లుగా రాశారు. బాపు కూడా షూటింగ్ కి బాదం ఆకుల విస్తర్లు కావాలని ప్రొడక్షన్ వాళ్లకు రాసిచ్చారు. షూటింగ్ ప్రారంభమైంది. ప్రొడక్షన్ వాళ్లు బాదం ఆకుల విస్తర్లు కాకుండా మామూలు విస్తర్లు తెచ్చారు. దీంతో బాపు..నేను బాదం విస్తర్లు తీసుకురమ్మంటే..ఇవి తెచ్చారేంటని అడుగగా..బాదం ఆకులు దొరకలేదని చెప్పారు.
''అదేమిటండీ..బాదం ఆకులు దొరక్కపోవడం ఏమిటి ? ఏమేం కావాలో మన వాళ్లు నిన్న పొద్దున్నే రాసిచ్చారు కదా. బాదం ఆకుల విస్తర్లే కావాలి. వెళ్లి తీసుకురండి. ఇంతపెద్ద హైదరాబాద్ లో ఎవరింట్లోనూ బాదంచెట్టు లేదా ? '' అని కసిరి మళ్లీ పంపించారట బాపు. అంతే ఫలానా చోట బాదం చెట్టుందంటే రెండు కార్లేసుకుని అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్. ఆఖరికి చిక్కడపల్లిలోని ఒకరింట్లో బాదం చెట్టుందని తెలిసినవారెవరో చెప్తే..అక్కడికెళ్లి ఆకులు కోసుకొచ్చి విస్తర్లు కుట్టి ఇచ్చేసరికి మధ్యాహ్నమయింది. ఆకులు వచ్చే సరికి ఇడ్లీలు చల్లారిపోయాయి. మళ్లీ వేడి వేడిగా ఇడ్లీలు తెప్పించి సన్నివేశాన్ని చిత్రీకరించారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక...నిడివి ఎక్కువగా ఉందని చాలా సీన్లు తొలగించినా..ఆఖరికి ఆ సీన్ ను కట్ చేయక తప్పలేదు. ఇంతా కష్టపడి సీన్ తీస్తే...అది కాస్త సినిమాలో లేకుండా పోయిందని బాధపడ్డారట. బాదం ఆకులు వచ్చేంతవరకూ షూటింగ్ ఆపేశారు. నిర్మాతలు వారిద్దరే కాబట్టి సరిపోయింది.