బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై అత్యాచారం కేసు

By సుభాష్  Published on  23 Sep 2020 11:46 AM GMT
బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై అత్యాచారం కేసు

ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటి పాయల్‌ ఘోష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నటిపాయల్‌ ఘోష్‌ తనలాయర్‌ నితిన్‌ సాత్పుటేతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 376 (ఐ), 354,341,342 సెక్షన్ల కింద అనురాగ్‌ కశ్యప్‌పై కేసు నమోదైంది. అనంతరం ఈ కేసు విచారణ జరుగుతుంది. 2013లో వెర్సోవాలోని యారి రోడ్డులో కశ్యప్‌ తనపై అత్యాచారం చేశారని నటి పాయల్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడేళ్ల కిందట జరిగిన ఈ ఘటన విచారణలో భాగంగా కశ్యప్‌ను ప్రశ్నించనున్నట్లు అధికారి తెలిపారు.

ముందుగా పాయల్‌ తన న్యాయవాదితో కలిసి ఒషివారా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా, ఈ ఘటన వెర్సోవా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగినందున అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అయితే వెర్సోవాలో ఘటన జరిగిందని చెబుతుండగా, అనురాగ్‌ కశ్యప్‌ కార్యాలయం ఒషివారా పరిధిలో ఉంది. ఇక ఈ ఆరోపణలు అనురాగ్‌ కొట్టిపరేయగా, ఆయన మాజీ భార్యతో సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు అనురాగ్‌కు మద్దతు తెలుపుతున్నారు.

కాగా, అనురాగ్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పాయిల్‌ ఘోష్‌ ఆరోపించగా, ఆమె వ్యాఖ్యలకు కంగనారౌత్‌ మద్దతు తెలిపింది. ఈ ఆరోపణలపై అనురాగ్‌ కశ్యప్‌ స్పందించాడు. పాయిల్‌ వ్యాఖ్యలను ఖండించాడు. తనను మౌనంగా ఉంచేందుకు యత్నిస్తున్నారని విమర్శించాడు. వామ్‌, నన్ను నిశ్చబ్దంగా ఉంచేందుకు నీకు చాలా సమయం పట్టింది. నన్ను మౌనంగా ఉంచేందుకు అబద్దాలు చెప్పడంతో పాటు ఈ విషయంలో మరో మహిళనులాగారు. మేడమ్‌ ఒక మహిళవు అయినందున నీ హద్దుల్లో నువ్వు ఉండు. నేను ఒక్కటే చెబుతున్నాను. ఈ ఆరోపణలు నిరాధారం.. అని అనురాగ్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. తాను ఎలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని, ఎవరైనా చేసినట్లు తెలిస్తే ఊరుకోనని చెప్పాడు. ఏం జరుగుతోందో చూద్దామని, మీ వీడియోలో ఎంత నిజముందో, అబద్దముందో తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా, అనురాగ్‌ కశ్యప్‌పై ఆరోపణలు చేసిన పాయల్‌ ఘోష్‌ తెలుగులో మంచు మనోజ్‌ సరసన ప్రయాణం మూవీలో నటించింది.Next Story