ముఖ్యాంశాలు

  • జైలు అధికారులు దాడి చేశారంటూ కోర్టులో పిటిషన్‌
  • దాడి చేసిన అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోర్టుకు అభ్యర్థన
  • విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా

ఢిల్లీ: నిర్భయ దోషి పవన్‌ గుప్తా ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపాడు. జైలు అధికారులు తనపై దాడి చేశారంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దాడి చేసిన అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోర్టుకు అభ్యర్థించాడు. కాగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే.. నిర్భయ దోషులను ఇంటర్వ్యూ చేసేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. నిర్భయ కేసులో ప్రధాన నిందితులైన ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌లను ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతించాలంటూ తాజాగా ఓ మీడియా సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయంస్థానం.. దీనిపై మీ నిర్ణయం రేపటిలోగా తెలపాలంటూ తీహార్ జైలు అధికారులకు స్పష్టం చేసింది.

ఇప్పటికే పలు సార్లు నిర్భయ కేసు నిందితుల ఉరిశిక్ష వాయిదా పడింది. కాగా ఇటీవల నిర్భయ దోషులకు ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలని ఢిల్లీ పటియాలా కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దోషులకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి.

అంజి గోనె

Next Story